తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో… ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది. తెలంగాణలో ఆషామాషీగా, నామమాత్రంగా పోటీచేసేకంటే పూర్తిగా దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు విడమరచి చెప్పినట్లు తెలిసింది. శనివారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుతో కాసాని ములాఖత్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల బరిలో నిలవాలని తాము కోరుకుంటున్నామని, పోటీకి అనుమతించాలని కోరారు.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. ఏపీలో మనం విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీకి తేలిగ్గా బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. మనం సర్వసన్నద్ధంగా ఉండి పోరాడితే మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన విషయాలపై మీరు కూడా ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం’’ అని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్‌కు సర్దిచెప్పినట్లు తెలిసింది.
👉 – Please join our whatsapp channel here –