ScienceAndTech

సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట

సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట

సాధారణంగా ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్‌ కార్డులను మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. కానీ కొందరు మాత్రం వందలు, వేల సంఖ్యలో సిమ్‌ కార్డులు పొందినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నాయి. అలా సేకరించిన సిమ్‌ కార్డులతోనే సైబర్‌ నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు భారత ప్రభుత్వం కొత్త ఆయుధం ప్రయోగిస్తోంది. అదే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌. దీంతో గడిచిన ఆరు నెలల్లో 64 లక్షలకు పైగా టెలికాం కనెక్షన్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఇంతకీ ఏమిటీ టెక్నాలజీ? ఎలా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు?

భారత టెలికాం విభాగం, సెంటర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ టెలీమేటిక్స్‌ (C-DoT) కలిసి ఈ సాంకేతికను అభివృద్ధి చేశాయి. ఎవరైనా వ్యక్తి నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ సిమ్‌ కార్డులను పొంది ఉంటే ఈ సాంకేతికత గుర్తిస్తుంది. ఒకే తరహా ముఖాలను ఈ సాంకేతికత గుర్తిస్తుంది. సాధారణంగా పెద్ద సంఖ్యలో సిమ్‌ కార్డులను పొందే వారు.. రూపాలు మారుస్తూ ఉంటారు. అయితే, మారు వేషం వేసినా పెదవులు, కళ్లలో మార్పు ఉండదు. దీని ఆధారంగానే ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ అలాంటి ముఖాలను గుర్తిస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా గుర్తించిన మోసపూరిత వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తొలుత టెలికాం కంపెనీలకు చేరవేస్తారు. అనంతరం సదరు వ్యక్తులకు కేవైసీ సమర్పించాలని నోటీసులు జారీ చేస్తారు. 60 రోజుల్లో సమాధానం రాకపోతే అటువంటి కనెక్షన్‌ను రద్దు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వెయ్యి నుంచి 2వేల ఫొటోలు కూడా తాము గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇలా గుర్తించిన ఖాతాల్లో ఎక్కువ శాతం సైబర్‌ మోసాలకు వినియోగించినట్లు తాము గుర్తించామని, కొందరైతే సిమ్‌ కార్డులను కొనుగోలు చేసి ఆ నంబర్లతో వాట్సాప్‌ ఖాతాలు తెరిచి.. ఆపై వాటితో మోసాలకు పాల్పడుతున్నారు. త్వరలో అటువంటి వాట్సాప్‌ ఖాతాలపైనా దృష్టి సారించనున్నారు. ఇలాంటి సిమ్‌ కార్డుల మోసాల వెనుక ఏజెన్సీల పాత్రే ప్రధానమని, వారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ మోసాల నేపథ్యంలోనే ప్రభుత్వం సిమ్‌ కార్డుల జారీ చేసే డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z