చలికాలం ప్రారంభమైంది. అయినా.. ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలకు ఉక్కపోతలు తప్పడం లేదు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటోంది. శుక్రవారం కూడా చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కన్నా 4.8 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 2.7 అధికంగా 34.6, ఆదిలాబాద్ 2.3 అధికంగా 32.8, హనుమకొండ 1.2 డిగ్రీలు అధికంగా 32.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు రోజుల నుంచి రాత్రిపూట కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు దుండిగల్‌లో 5.1 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హయత్‌నగర్ 5.4 డిగ్రీలు అధికంగా 23, హైదరాబాద్ 4.7 డిగ్రీలు అధికంగా 23.7 డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –