కేసీఆర్ బతికి ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్ రాజ్యంగానే ఉంటుందని భారాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘‘ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందో అలాంటి పార్టీనే ఎన్నుకోవాలి. పార్టీ, అభ్యర్థి చరిత్ర చూసి ఓటేయాలి. గతంలో లకారం చెరువు ఎంత వికారంగా ఉండేది. ఇప్పుడు ఎంత సుందరంగా ఉంది? రూ.100 కోట్లతో లకారం చెరువును అభివృద్ధి చేశాం.
నాడు ఖమ్మం అంటే ఇరుకు సందులు, మురికి కాల్వలు.. దుర్గంధంతో కూడిన పట్టణంగా ఉండేది. ట్రాఫిక్ కష్టాలు, రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉండేది. కానీ, ఈరోజు ఖమ్మంలో ఆరు లేన్ల రహదారులు, సందుల్లో కూడా వైట్ టాప్ సిమెంట్ రోడ్లు.. దారి పొడవునా దగదగలాడే విద్యుత్‌దీపాలు.. పచ్చటి చెట్లు. ఈ అభివృద్ధి అంతా మంత్రమేస్తేనో.. మాయ చేస్తేనో జరగలేదు.. మీ మంత్రి పనిచేస్తేనే జరిగింది. వాడ వాడలో.. పువ్వాడ అని పేపర్లో వార్తలు వచ్చేవి. ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో మీరు స్వయంగా చూశారు. పువ్వాడను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చు కుంటాయి .. మీ ఇష్టం. పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తప్పలు కావాలా? తేల్చాల్సింది ఖమ్మం ప్రజలే. ఖమ్మం నగరంలో ఐటీ టవర్.. కలలోనైనా ఇది ఊహించారా? ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలని పట్టుబట్టి పెట్టించిన ఘనత పువ్వాడ అజయ్‌దే. ప్రభుత్వ విజన్.. పువ్వాడ మిషన్‌తోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమైంది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –