వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోజుకొక ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సోమవారం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురందేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురంధేశ్వరి మారారు అని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని చంద్రబాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురంధేశ్వరిది’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.‘సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో చంద్రబాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. ‘అన్న టీడీపీ’అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ’ అని దగ్గుబాటి పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –