Politics

శవాల పక్కనే పొత్తుల చర్చ

Chandrababu Discussed Alliances With KTR Right Next To HariKrishnas Dead Body

తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి చంద్రబాబునాయుడు కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్  విమర్శించారు.

గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. 

ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్‌కు జగన్ కౌంటరిచ్చారు.  గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టు స్ధిరీకరించడం కోసం ఉపయోగిస్తే సంతోషించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

గోదావరి జలాలను శ్రీశైలం ద్వారా కృష్ణా ఆయకట్టుకు తరలించడంపై రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. ఒప్పందాలు జరగకుండానే రాష్ట్రానికి ఎలా అన్యాయం జరుగుతోందని చంద్రబాబునాయుడు చెబుతారని ఆయన ప్రశ్నించారు.

భవిష్యత్తులో ఈ నీటి విషయమై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరుగుతాయన్నారు. ఈ ఒప్పందాలపై రెండు రాష్ట్రాల సీఎంల హోదాలో కేసీఆర్, తాను, రెండు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేస్తారని ఆయన చెప్పారు.

తాను కేసీఆర్‌తో కలవకుండా కేంద్రం కుట్రలు చేసిందని చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను జగన్ ఏపీ అసెంబ్లీలో చూపారు. తన బావమరిది హరికృష్ణ చనిపోతే కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్‌తో చంద్రబాబునాయుడు పొత్తుల గురించి చర్చించారని  జగన్  విమర్శించారు. 

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు ఆనాడు ఎందుకు అడ్డుకోలేదో చెప్పాలన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా వ్యవహరించాలని ఆయన కోరారు.