* తుమ్మల పై పువ్వాడ విమర్శలు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి విమర్శల దాడి చేశారు. సీనియర్ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ▪తుమ్మలకు ఓటు వేసే వారికే ఓటు ఉండాలా అని ప్రశ్నించిన పువ్వాడ…. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు.ఖమ్మం జిల్లాలో ఇంటి నంబర్లు లేకుండా ఓట్లు నమోదు చేశారని సోమవారం రోజున కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దొంగ ఓట్లు నమోదు చేశారంటూ ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, సీఈవో ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంటి నంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని లేఖలో కోరారు తుమ్మల. తాజాగా ఈ వ్యవహారంపై పువ్వాడ మండిపడ్డారు.
* ఓటర్ల జాబితాలో మహిళ స్థానంలో జగన్ ఫొటో
ప్రకాశం జిల్లా ఓటర్ల జాబితాలో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఏకంగా అక్కడి ఓటర్ల జాబితాలో సీఎం జగన్ ఫోటో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామ ఓటర్ల జాబితాలో సీఎం జగన్ ఫోటోను అధికారులు ముద్రించారు. గురవమ్మ అనే మహిళ ఫోటోకి బదులు సీఎం జగన్ ఫోటోను ముద్రించారు. జగన్ ఫొటోతో ఉన్న లిస్ట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అధికారులు హడావిడిగా దానికి సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
* పురంధేశ్వరిపై రోజా ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరిపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నెక్ట్స్ కేసుపై చెప్పకండి అని చెప్పారు. స్కామ్ ల ద్వారా స్కీమ్స్ లను వాడుకున్న ఘనత చంద్రబాబుది.. రెయిన్ గన్ లతో ఎక్కడైనా కరువు జయించగలమా..రెయిన్ గన్ తో వేలాది ఎకరాలు పండించగలమా.. రెయిన్ గన్ విషయంలో కూడా చంద్రబాబుపై కేసులు పడతాయి.. జైలుకు పోతాడు అని ఆమె పేర్కొన్నారు. రైతు ద్రోహి చంద్రబాబు.. కోట్లాది రూపాయిలు జగన్ ప్రజలకు ఇస్తున్నాడు అని మంత్రి రోజా తెలిపారు.సీఎం జగన్ కేసులపై కక్ష సాధింపులో భాగంగా సుప్రీంకోర్టుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాశారు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పురంధేశ్వరి అమె పని అమె చూసుకుంటే చాలు.. జగన్ కేసుల గురించి లేఖలు రాయల్సిన అవసరం లేదు అని మంత్రి చెప్పారు. జగన్ తన కేసులను విచారించాలని పిటీషన్ పెట్టుకున్న దమ్మున్న నాయకుడు జగన్.. పురంధేశ్వరికి ఒక నియోజకవర్గం లేదు.. ఆమెను చూసి ఓటు వేసే వాళ్ళు ఎవరు అంటూ మంత్రి రోజా సెటైర్ వేసింది.ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఒక రోజు అయినా అన్నం పెట్టి.. నీళ్ళు ఇచ్చావా పురంధేశ్వరి అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. పురందరేశ్వరి ఒక జగత్ కిలాడీ.. బావ కళ్లులో ఆనందం కోసం లేఖలు రాస్తోంది.. పురంధేశ్వరి లాంటి నీతి మాలినా, జగత్ కిలాడి లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదని కోరుకుంటున్నాను.. పురంధేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఎడుస్తుంటారు అంటూ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది.
* అమిత్ షా సవాల్‌కు భూపేష్ బఘేల్ సై
చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల (Chhattisgarh Polls) తొలి దశ పోలింగ్ కొనసాగుతుండగా ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్‌కు భూపేష్ బఘేల్ అంగీకరించారు. గత ఐదేండ్లుగా తాను చేసిన అభివృద్ధి, 15 ఏండ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని సీఎం ప్రకటించారు. 15 ఏండ్లుగా మీ హయాంలో వెలుగుచూసిన కుంభకోణాలు, ఐదేండ్లలో తాము చేసిన పనులపై చర్చ జరగాలని భూపేష్ బఘేల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.నల్ల రంగు సోఫాపై ఇరువైపులా అమిత్ షా, భూపేష్ బఘేల్ పేర్లున్న ఫొటోను కూడా ఆయన ట్వీట్ చేశారు. చర్చా వేదిక, సమయం, ప్రదేశం గురించి మీరు ఇంకా వెల్లడించలేదని, అయితే ప్రజలు మాత్రం ఇప్పటికే వేదికను సిద్ధం చేశారని రాసుకొచ్చారు.కాగా చత్తీస్ఘఢ్లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో అమిత్‌షా ప్రసంగిస్తూ మోదీ 15 ఏండ్ల హయాంలో జరిగిన అభివృద్ధి, చత్తీస్ఘఢ్లో భూపేష్ బఘేల్ హయాంలో ఐదేండ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక చత్తీస్‌ఘఢ్‌లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుండగా, మిగిలిన నియోజకవర్గాల్లో ఈనెల 17న మలివిడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
* కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడం కంటే ముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ మోసాల వల్ల తెలంగాణ ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి మరణిస్తే.. అతని కుటుంబానికి ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. మా తెలంగాణ వస్తే.. మాకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది ప్రాణాలను అర్పించుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా నా హయాంలోనే జరిగింది. ఏదో ఒక రోజు సీఎం అవుతానని.. కానీ నాకు సీఎం కావాలని లేదు.. మీ ఆదరణ చూస్తుంటే.. చర్మం వలించి చెప్పులు కుట్టించినా తక్కువే. మనం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ స్కీమ్ లు అమలు చేస్తామని తెలిపారు.మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందని.. ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని తెలిపారు కోమటిరెడ్డి. ఉద్యోగాల ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 15 తారీఖు వచ్చినా కానీ జీతాలు రావడం లేదు. కాంగ్రెస్ హయాంలో 1వతేదీనే జీతాలు అందజేశాం.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలం నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
* ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బిగ్ షాక్
ఎన్నికల వేళ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా ఆయనపై మంగళ్ హాట్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. ఈ నోటీసులు జారీ చేసిన పోలీసులు వీటిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా ఈవెంట్‌కు వచ్చే వారందరి గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలని.. ఈ ఈవెంట్ కోసం ఓ వర్గం బౌన్సర్లు, డీజే ఆర్టిస్టులను రప్పిస్తే దాడులు చేస్తామని ఆ వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా కత్తులు, ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.రాజాసింగ్ ప్రదర్శించిన తుపాకులు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందివని.. వాటిని ప్రదర్శించడం నిషేధమని, పోలీసుల వెపన్స్‌తో పాటు కత్తులను ప్రదర్శించడం చట్ట విరుద్ధమని వీటిపై స్థానిక నాయకుడు సమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులపై స్పందించిన రాజాసింగ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.
* పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సెటైర్ వేశారు. “పురందేశ్వరి గారు.. కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు.. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు.. మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే.. మీ అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే.. మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు.. స్వార్థం తప్ప.. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అంటూ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
* కడప ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదం గురించి మరువకముందే కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ..కడప నగరంలోని సంద్యా కూడలి వద్దకు రాగానే బ్రేక్ సరిగా పనిచేయడంలేదని డ్రైవర్ గమనించాడు. కానీ బస్సును నడిరోడ్డుపై ఆపితే సమస్య వస్తుందని భావించి అలాగే కడప ఆర్టీసీ బస్టాండ్ వరకు తీసుకొచ్చాడు. బస్టాండ్ ప్రాంగణంలోకి రాగానే బస్సును పక్కకు ఆపుతుండగా పూర్తిస్థాయిలో బ్రేక్ పడలేదు. ఈ క్రమంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై కూర్చొని మాట్లాడుతుండగా.. బస్సును వారిని ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరో డ్రైవర్‌తో బస్సును తనిఖీ చేయించగా.. బ్రేక్ సరిగా పడకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.
👉 – Please join our whatsapp channel here –