‘‘మీరు ఎవరితో అయిన కలిసి కాఫీ తాగండి.. కానీ, మీరు అనుకున్నదే చేయండి’’ అని బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఆదిత్య పురి తెలిపారు. ఆయన బృందం ఈ వాక్యాలను అక్షరాలా ఆచరించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు విజయ్ మాల్యా చుట్టూ ప్రదక్షిణలు చేసే అవస్థ తప్పింది. ప్రస్తుతం ఆదిత్య హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు తమల్ బంధోపాధ్యాయ రచించిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘మనం ఎవరితోనైనా కలిసి కాఫీ తాగవచ్చు.. కానీ, మనం ఏది అనుకుంటామో అదే చేయాలి. వ్యక్తిగత పరిచయాలను వృత్తిలోకి తీసుకొని రాకూడదు. నా చిరకాల సహచరుడు పరేష్ సుక్తాంకర్ ఈ విషయాన్ని అక్షరాలా ఆచరించాడు. మీరు రిస్క్‌గా మారితే.. మీకు అప్పు ఇవ్వడం నాకు కూడా రిస్కే. మీరు నాకు మిత్రుడైతే పిలిచి కాఫీ ఇచ్చి పంపించగలను. కొన్నేళ్ల కిందట రుణం కోసం దరఖాస్తు తీసుకొని మాల్యా సిబ్బంది నా వద్దకు వచ్చారు. ఆ దరఖాస్తును పరిశీలిస్తానని చెప్పి వారికి కాఫీ ఇచ్చి పంపించేశాను. ఆ తర్వాత దరఖాస్తును నా సహచరుడు పరేష్‌కు అందజేశాను. ఆయనకు మాల్య విషయం అర్థమై.. ఆ దరఖాస్తును నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత మాల్యా ఫోన్ చేసిన ప్రతిసారి ఆవేశంగా మాట్లాడేవారు. స్నేహం.. బ్యాంకింగ్ అనే రెండు కత్తులూ ఒకే ఒరలో ఇమడవు. వచ్చే మూడు నెలల్లో మా బ్యాంక్‌ను లైఫ్ స్టైల్ బ్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన 90శాతం పని పూర్తిచేశాము ’’ అని ఆదిత్యపురి వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రుణాల మంజూరు విషయంలో స్పష్టమైన విధానం ఉండటంతో ఆ బ్యాంక్‌కు అతితక్కువ ఎన్‌పీఏలు ఉన్నాయి. పదేళ్ల నుంచి నికర లాభాల్లో 20శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2019 మార్చి త్రైమాసికంలో బ్యాంక్ 23శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.
మాల్యా దెబ్బ నుండి HDFC అలా తప్పించుకుంది
Related tags :