పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు (Winter Session of Parliament) రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించారు. డిసెంబర్ 22 వరకు సెలవులు మినహాయించి 15 రోజుల పాటు ఉభయసభలు సమావేశమవుతాయని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత- 2023 (Bharatiya Nyaya Sanhita), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023 (Bharatiya Nagarik Suraksha Sanhita), భారతీయ సాక్ష్య బిల్లు- 2023 (Bharatiya Sakshya Bill)లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నివేదికలు ఇటీవల హోం మంత్రిత్వ శాఖకు అందాయి. తాజా సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం ఉంది. ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CrPC), ఎవిడెన్స్ చట్టాల (Indian Evidence Act) స్థానంలో కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చింది. వీటితోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. శీతాకాల సమావేశాల్లో వీటిని ఓ కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –