అమెరికా అధ్యక్ష ఎన్నికలు(American Presidential elections) సమీపించేకొద్దీ అక్కడి నేతల మధ్య దూషణభూషణలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రజల దృష్టిలో పడేందుకు, వారిని తమవైపునకు తిప్పుకునేందుకు నేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ నేతల మధ్య ఇటీవల జరిగిన మూడో చర్చా కార్యక్రమం(Republican debate) రసాభాసగా మారింది. తొలి డిబేట్లో అమెరికా ప్రజల దృష్టిని ఆకర్షించిన భారత సంతతి నేత వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఆ తరువాత రేటింగ్స్ విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఈ క్రమంలో దూకుడుపెంచిన వివేక్ రామస్వామిపై మరో భారత సంతతి నేత నిక్కీ హేలీ(Nikki Haley) విరుచుకుపడ్డారు. నువ్వో చెత్త అంటూ విమర్శలు గుప్పించారు.
అమెరికా ఎన్నికల్లో ప్రముఖ చైనా యాప్ టిక్‌టాక్(Ban on Tiktok) ప్రధాన ఎజెండాగా మారింది. దీనిపై చర్చ సందర్భంగా వివేక్ రామస్వామి.. నిక్కీ హేలీ కూతురి ప్రస్తావన తెచ్చారు. ఆమె కూడా ఎంతో కాలంగా టిక్‌టాక్ వాడుతోందని చెప్పుకొచ్చారు. కాబట్టి, ముందు నిక్కీ తన కుటుంబం గురించి ఆలోచించాలని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నిక్కీ హేలీ నువ్వో చెత్త అంటూ రామస్వామిపై మండిపడ్డారు. తన కూతురి పేరెత్తొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ సంవాదంపై అక్కడున్న వీక్షకులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, రిపబ్లికన్ పార్టీ తరుపున ముందు వరుసలో ఉన్న డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మాత్రం ఈ డిబేట్లకు తొలి నుంచి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఓమారు అధ్యక్షుడిగా పనిచేసిన తన గురించి ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీ తరుపున అధ్యక్ష బరిలో దిగేది ట్రంప్యేనని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ట్రంప్ గెలిచాక లభించే ఉపాధ్యక్ష పదవి కోసం వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, ఫ్లారిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ మధ్య గట్టిపోటీ నెలకొందని అంటున్నాయి. వివేక్ రామస్వామికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. మరోవైపు, నిక్కీ హేలీ గతంలో అమెరికా తరుపున రాయబారిగా పనిచేశారు.
👉 – Please join our whatsapp channel here –