* బైజూస్‌కు ఎదురుదెబ్బ
ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఎడ్టెక్ సంస్థ బైజూస్ (Byju’s)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన ఓ యూనిట్‌ను రుణదాతల గ్రూప్ తమ అధీనంలోకి తీసుకోవడాన్ని డెలావెర్ ఛాన్స్రీ కోర్టు సమర్థించింది. బైజూస్ (Byju’s) పలుసార్లు రుణ చెల్లింపు నిబంధనలను ఉల్లంఘించిందని నిర్ధారించింది.బైజూస్ (Byju’s)కు రెడ్‌వుడ్ ఇన్వెస్ట్మెంట్స్, సిల్వర్ పాయింట్ క్యాపిటల్ సహా మరికొన్ని సంస్థలు 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని అందజేశాయి. కానీ, కొవిడ్ తర్వాత ఎడ్టెక్ బిజినెస్ దెబ్బతినడంతో కష్టాల్లో కూరుకుపోయిన బైజూస్ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోయింది. ఇది రుణ ఎగవేతకు దారితీసింది. ఫలితంగా నిబంధనల ప్రకారం.. రుణదాతలు ఎంపిక చేసిన టిమోతీ పోల్ అనే వ్యక్తి కంపెనీకి చెందిన ‘బైజూస్ ఆల్ఫా’లో ఏకైక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం రుణ షరుతల ప్రకారమే జరిగినట్లు తాజాగా కోర్టు తేల్చింది. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ బైజూస్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.రోజురోజుకీ బైజూస్ ఆర్థిక కష్టాలు పెరిగిపోతున్న నేపథ్యంలో 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని వసూలు చేసుకోవడం కోసం రుణదాతులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ రుణ అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)’ బైజూస్ ఆల్ఫాను తమ ప్రయోజనాలను రక్షించేలా హోల్డింగ్ కంపెనీలా మార్చినట్లు రుణదాతల తరఫు న్యాయవాది తెలిపారు. ఎడ్టెక్ కంపెనీని పూర్తిగా టేకోవర్ చేయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
* ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో
టెక్ దిగ్గజం విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు మండిపోతున్నాయి. ఆదాయం చాలక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇక వేతన జీవులు తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది టెక్ దిగ్గజం విప్రో. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. డిసెంబర్ ఒకటిన విప్రో ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. అయితే, అధిక జీతాలు తీసుకుంటున్న వాళ్లకు ఈ ఏడాది పెంపులు ఉండబోవంటూ అంతర్గత ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపింది విప్రో. తక్కువ జీతాలు పొందుతున్న వాళ్లకు మినహాయింపు ఇచ్చింది. వాళ్లకు యథావిధిగా డిసెంబర్ ఒకటో తారీఖున జీతాలు పెరగనున్నాయి. సాధారణంగా టాప్ పెర్ఫార్మర్లకు జీతాల్లో అధిక పెంపు ఇస్తూ వస్తుంది విప్రో. అయితే, ఈ సారి సెలక్టీవ్ మెరిట్ సాలరీ ఇంక్రీజ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం తక్కువ వేతనం పొందుతున్న వాళ్లలో అర్హులకు మాత్రమే జీతాల పెంపు ఉంటుంది. అందువల్ల.. అధిక వేతనాలు పొందుతున్న వాళ్లు అద్భుతమైన పనితీరు కనబర్చినా.. జీతాల పెంపు మాత్రం ఉండబోదని స్పష్టం చేసింది విప్రో యాజమాన్యం. గత సెప్టెంబర్ 30 నాటికి విప్రోలో 2 లక్షల 44 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని సాఫ్ట్వేర్ ఎగుమతిదారుల్లో నాల్గో స్థానంలో ఉంది ఈ సంస్థ. అయితే, ప్రస్తుతం సంస్థ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ వైపు క్లయింట్లు ఖర్చు తగ్గించుకుంటున్నారు. మరోవైపు.. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అందరికీ జీతాలు పెంచి భారం పెంచుకోవడం సరికాదనే ఆలోచనలో విప్రో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.
* ఉద్యోగులకు దీపావళి కానుక
ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు దీపావళి కానుక లభించింది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రారంభమైనట్లు ఈపీఎఫ్ఓ(EPFO) ప్రకటించింది. ఇప్పటికే 24 కోట్లకుపైగా అకౌంట్లలో వడ్డీ పడిందని.. అన్ని ఖాతాల్లో జమ అయ్యేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చని తెలిపింది. దీంతో ఉద్యోగులకు దీంతో ఉద్యోగులకు దీపావళి కానుక అందినట్లు అయింది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. కాగా, ఇంట్రెస్ట్ జమ కాగానే అంది మీ ఖాతాల్లో చూపిస్తుందని పేర్కొంది. యూఎమ్‌ఏఎన్‌జీ(UMANG) యాప్ లేదా EPFO వెబ్సైట్లో లాగినై వడ్డీ పడిందో లేదో తెలుసుకోవచ్చు.
* ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ నిల్వలపై వడ్డీ (PF Interest) మొత్తాలను పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమ అవ్వగా.. ఇంకా పలువురి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అకౌంట్లలో కనిపించడానికి కాస్త సమయం పడుతుందని ఈపీఎఫ్ఓ ఓ ఎక్స్ యూజర్‌కు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ నిల్వలలపై 8.15 శాతం వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఈపీఎఫ్ఓ వడ్డీని ఆయా ఖాతాల్లో జమ చేస్తోంది. ఈపీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి ‘ఫర్ ఎంప్లాయీస్’ సెక్షన్ ఎంచుకోవాలి. అందులో మెంబర్ పాస్‌బుక్‌ను ఎంచుకోవాలి. తర్వాత లాగిన్ పేజీలో యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వడం ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.కేంద్రం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్ సెక్షన్లోకి వెళ్లి.. వ్యూ పాస్‌బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. కావాలంటే ఇ-పాస్‌బుక్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
* మస్క్ సంపదలో 75వేల కోట్లు ఆవిరి
టెస్లా షేర్లు పడిపోవడంతో ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఆస్తిలో దాదాపు రూ.75వేల కోట్లు (9 బిలియన్ డాలర్లు) ఆవిరైపోయాయి. టెస్లా త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయంటూ హెచ్ఎస్బీసీ విశ్లేషకుడు మైకేల్ టిండాల్ రేటింగ్‌ను తగ్గించడం షేర్ల విలువను పతనం చేసింది. టెస్లాలో మస్కు 13శాతం వాటా ఉంది. కాగా.. ఇప్పటికీ రూ. 18 లక్షల కోట్లకు పైగా ఆస్తితో ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఆయన కొనసాగుతున్నారు.
* కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివ్
దేశవ్యాప్తంగా 11.5 కోట్ల పాన్ కార్డులు డీ యాక్టివ్ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయని కారణంగా పాన్ కార్డులను డీయాక్టివ్ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్లు ఉండగా.. అందులో 57.25 కోట్ల మంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకున్నట్లు బోర్డు తెలిపింది. మొత్తం 12 కోట్ల మంది పాన్ కార్డు దారులు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.2017 జులై 1 కంటే ముందు ఇష్యూ చేసిన పాన్ కార్డులను ఆధార్ తో లింక్ చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందరూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకునేలా పలుమార్లు గడువును సీబీడీటీ పెంచింది. ఇక, డీయాక్టివేట్ అయిన కార్డులను పునరుద్ధరించడానికి సీబీడీటీ చాన్స్ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.వెయ్యి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 2023 జూన్ 30 గడువును మిస్ అయిన వారు పెనాల్టీ చెల్లించి మళ్లీ కార్డు పొందవచ్చు. కాగా.. పాన్ కార్డును తిరిగి పొందేందుకు 30 రోజుల సమయం పట్టనుంది.
* భారీ పెరిగిన ఇంటి అద్దెలు
గత తొమ్మిది నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఐటీ సిటీ బెంగళూరులో గత జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు దాదాపు 31 శాతం పెరిగాయి. బెంగళూరులో 2 BHK అంటే 1000 చదరపు మీటర్ల ఫ్లాట్ అద్దెలో దాదాపు 31 శాతం పెరిగిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ నివేదించింది.బెంగళూరులోని 2 BHK ఫ్లాట్‌కు ప్రజలు సాధారణంగా నెలకు రూ. 28,500 వరకు అద్దె చెల్లించాలి. జనవరిలో నెలకు దాదాపు రూ.24,600గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి-సెప్టెంబర్ మధ్య ఇళ్ల ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. బెంగళూరులోని సర్జాపూర్ రోడ్లో గత తొమ్మిది నెలల్లో ఇంటి అద్దెలు దాదాపు 27 శాతం పెరిగాయి. గత తొమ్మిది నెలల్లో బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాల్లో కూడా నివాస అద్దెలు పెరిగాయి. ఇందులో హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబై వంటి నగరాల పేర్లు ఉన్నాయి. ఐటీ సిటీ హైదరాబాద్‌లో జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు 24 శాతం పెరిగాయి. కాగా, పూణెలో గత తొమ్మిది నెలల్లో రెసిడెన్షియల్ అద్దె 17 శాతం పెరిగింది. ఢిల్లీలో జనవరి-సెప్టెంబర్ మధ్య ద్వారక ప్రాంతంలో ఇంటి అద్దెలు 14 శాతం పెరిగాయి. నోయిడా సెక్టార్ 150లో అద్దె ధరలో 13 శాతం పెరుగుదల, గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్లో 11 శాతం పెరిగింది.ముంబైలో చెంబూర్, ములుంద్ ప్రాంతాల్లో నివాస గృహాల అద్దెలో 14 శాతం, 9 శాతం పెరుగుదల కనిపించింది. చెన్నైలోని పల్లవరం, పెరంబూర్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు 12 శాతం, 9 శాతం పెరిగాయి. కాగా, గత తొమ్మిది నెలల్లో కోల్‌కతాలోని బైపాస్, రాజర్హట్ ప్రాంతాల్లో 14 శాతం,9 శాతం పెరుగుదల కనిపించింది.
* ఐసీబీసీకి చెందిన అమెరికా యూనిట్‌పై హ్యాకర్లు సైబర్ దాడి
చైనాకు చెందిన అతిపెద్ద బ్యాంకు ‘ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ICBC)’ అమెరికా యూనిట్‌పై సైబర్‌దాడి జరిగింది. దీంతో ఈ సంస్థ కొన్ని యూఎస్ ట్రెజరీ ట్రేడ్లను నిర్వహించలేకపోయింది. దాడి ప్రభావం మరింత విస్తరించకుండా కొన్ని వ్యవస్థలను వేరుచేయడం వల్లే ట్రేడ్లను నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది. వీటిని తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సెటిల్ చేసినట్లు వెల్లడించింది. ఈ వారంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తాజా సైబర్దాడిపై విచారణ చేపట్టినట్లు ఐసీబీసీ వెల్లడించింది. అలాగే దర్యాప్తు సంస్థలకూ సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కంపెనీ బ్యాంకింగ్, మెయిల్ సహా ఇతర ఏ వ్యవస్థలపై దాడి ప్రభావం లేదని స్పష్టం చేసింది. దీనిపై సంస్థ ఇంతకుమించి ఎలాంటి విషయాలను బహిర్గతం చేయలేదు. అయితే, రష్యన్ మాట్లాడే ర్యాన్సమ్వేర్ సిండికేట్ అయిన లాక్‌బిట్ గ్రూప్ ఈ దాడి వెనకాల ఉన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. పాత సోవియట్ యూనియన్‌లో లేని దేశాలపై ఈ గ్రూప్ సైబర్ దాడులకు పాల్పడుతుంటుందని తెలిపాయి. 2019 నుంచి ఇది క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వేలాది సంస్థలపై ఇది సైబర్‌దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –