ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ-జనసేన దృష్టి పెట్టాయి. రెండు పార్టీల నుంచి ఏర్పాటైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం నేడు జరగనుంది. రెండు పార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళేందుకు తెలుగుదేశం-జనసేన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం నేడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరగనుంది.
ఇప్పటికే టీడీపీ రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించింది. మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు హామీలు ఇచ్చింది. ఇక జనసేన కూడా నాలుగైదు ప్రతిపాదనలు ముందుకి తెచ్చింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ముందుకు తెచ్చింది. రెండు పార్టీల ప్రతిపాదనలపై మేనిఫెస్టో కమిటీలో చర్చించనున్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం రెండు పార్టీల నుంచి ముగ్గురేసి నాయకుల చొప్పున కమిటీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు రెండు పార్టీల నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఉన్నారు. ఇక జనసేన పార్టీ నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ.. పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.
ఈ నెల తొమ్మిదో తేదీన విజయవాడలో జరిగిన జేఏసీ సమావేశంలో దూకుడు పెంచాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఎలాంటి కార్యక్రమం చేపట్టినా, ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా, రెండు పార్టీల ప్రతినిధులు ఉండాలని నిర్ణయించాయి. ఇప్పటికే జిల్లాలవారీ ఆత్మీయ సమావేశాలు ముగియడంతో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు జరపాలని జేఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఈ నెల 16 వరకూ మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు జరపాలని నిర్ణయించారు.
ఈ నెల 18 నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేయాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రోడ్ల సమస్యపై ఈ నెల 18,19 తేదీల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని రెండు పార్టీల నేతలు యోచిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూనే మేనిఫెస్టోపై ప్రచారం చేయాలని రెండు పార్టీలూ ఇప్పటికే నిర్ణయించాయి.
👉 – Please join our whatsapp channel here –