అతడొక విధాత. భవిష్యత్ తరాల కోసం తన బతుకును త్యాగం చేసిన ప్రదాత. అతనొక వ్యూహకర్త. అందుకే తన పథకం ప్రకారం ఏకంగా 1360 ఎకరాల అడవినే సృష్టించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని కష్టాలు, ఆటుపోట్లు వచ్చినా నేను చెయ్యగలను అనే మొండి ధైర్యం అతడిది. ఆయనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పయెంగ్. మన మట్టి భాషలో చెప్పాలంటే అడవి మనిషి. అడవినే నమ్ముకొని, లోకమంతా పచ్చగా కళకళలాడాలని కోరుకుంటున్న మనిషి కథ ఇది. అది 1979. అసోంలోని జొర్హాట్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సమయం. ఎటుచూసినా భీకర గాలులు, కుండపోత వర్షాలు. తుపాను కారణంగా బ్రహ్మపుత్ర నదికి సమీపంలో ఆ జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఆ నదికి సమీపంలో పులులు, సింహాలు, ఏనుగులు, రైనోలు, మొసళ్లు, పలు రకాల జంతువులు, పక్షుల (ముఖ్యంగా వలస పక్షులు)తో 1360 ఎకరాల్లో విస్తరించిన మొలాయ్ అడవి కళకళలాడుతూ ఉండేది. ఆ అకాల వర్షంతో వరదలు అడవిని చుట్టుముట్టాయి. రాత్రికి రాత్రే ఆ అడవంతా నాశనమైంది. గూడు చెదిరిన పక్షులు ఆర్తనాదాలు చేసుకుంటూ అడవిని విడిచిపెట్టాయి. నీటిలో తిరిగే ప్రాణులు తప్పా.. అక్కడేమీ మిగలలేదు. రెండ్రోజుల తర్వాత ఎటు చూసినా జంతువుల కళేబరాలే. వరదలకు చెట్టూ పుట్టా అన్నీ కొట్టుకుపోయాయి. ఇసుక మేటవేసి.. గడ్డిమొక్క మొలవకుండా చేసింది. 30 ఏండ్ల తర్వాత.. ఇప్పుడా 1360 ఎకరాల మొలాయ్ అడవి ఎప్పటిలాగే కళకళలాడుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్వ వైభవం సంతరించుకున్నది. ఎటు చూసినా పక్షుల కిలకిలరావాలే వినపడుతున్నాయి. అడవి లోపలికి వెళ్తే.. జంతువుల అరుపులు భయపెడుతున్నాయి. ఆ ఆడవి మధ్యలోని చిన్న చెరువులో జలచరాలు సంతోషంగా కాలమెల్లదీస్తున్నాయి. మార్పు.. ఇంతటి మార్పు.. ఎలా సంభవించింది? ఎవరు ఆ అడవిని పునరుద్ధరించారు? 40 యేండ్లలో ఎవరూ ఊహించని మార్పు.. కేవలం ఒక్కడి వల్ల జరిగిందంటే నమ్ముతారా? కేవలం ఒక్కడి వల్లే. ఒకే ఒక్కడి వల్ల.
అతనే జాదవ్ పయెంగ్..
1979లో భీకర వరదలు వచ్చే నాటికి జాదవ్ పయెంగ్‌కు 16 యేండ్లు. జొర్హాట్ జిల్లాలో వరదల కారణంగా తను నివసిస్తున్న కోకిలముఖ్ ప్రాంతంలో 1360 ఎకరాలలోని అడవిలో చెట్లన్నీ కొట్టుకు పోయాయి. జంతువులన్నీ చనిపోవడంతో అడవి కళ తప్పింది. వలస పక్షులు రావడం లేదు. ఒక్కసారిగా ఆ ప్రాంతం బోసిపోయింది. అది చూసిన జాదవ్ పయెంగ్ చాలా బాధపడ్డాడు. ఎలాగైనా అడవిని తిరిగి పునరుద్ధరించాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. వరదలను తట్టుకునే మొక్కలు లేనందుకే వినాశనం జరిగిందని గ్రహించాడు. అడవే లేకపోతే మన బతుకులు ఎలా అంటూ పెద్దలను ప్రశ్నించాడు. వారి నుంచి సమాధానం లేదు. అప్పటికి అతనికి తెలిసిన సమాధానం ఒక్కటే.. అడవి పునరుద్ధరణ. ఎలాగైనా అడవిని పునరుద్ధరించాలని ఒక్కడే మొండి నిర్ణయం తీసుకున్నాడు.
ఒంటరిగానే అడుగు ముందుకు..
మొలాయ్ అడవికి ఎలాగైనా పూర్వ వైభవం తీసుకురావాలన్న జాదవ్.. ఒంటరిగానే అడుగుముందుకేశాడు. ఈ క్రమంలో అటవీశాఖ వారిని సంప్రదిస్తే.. నువ్వే మొక్కలు నాటుకో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తోటివారితో ఆలోచన పంచుకున్నాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ఒంటరిగానే నడుం బిగించాడు. ఆ నదీ ద్వీపంలో మొదట వెదురు మొక్కలు నాటడం మొదలెట్టాడు. రోజూ రకరకాల మొక్కలు నాటుతూ వెళ్లాడు. అయితే వాటికి నీరు పట్టడం సమస్యగా మారేది. అతనిది మధ్య తరగతి కుటుంబం. ఒకవైపు కుటుంబ పోషణ చూసుకుంటూ అడవి సంరక్షణకు శ్రీకారం చుట్టాడు.
డ్రిప్ పద్ధతిలో నీరు
మొలాయ్ అడవిని పునరుద్ధరించే క్రమంలో బ్రహ్మపుత్ర నదిలో నీటిని కావడితో మోసేవాడు జాదవ్. నీరు తీసుకొచ్చి మొక్కలకు పోయడం తన శక్తికి మించిన పని. అయినా వెనకడుగు వేయలేదు. కొంత తెలివితో వెదురు బొంగులతో మొక్కలపై భాగంలో ఒక ప్లాట్‌ఫాంలాగా ఏర్పాటు చేశాడు. దానిపై ఒక నీటి కుండను ఉంచి.. చిన్న రంధ్రం చేసి, డ్రిప్ పద్ధతిలో నీరు మొక్కలకు అందేలా చర్యలు తీసుకున్నాడు. ఒకసారి కుండను నింపితే వారం రోజులు సరిపోయేది. ఇలా అడవిలో కుండలను ఏర్పాటు చేసి మొక్కలను బతికించాడు. ఈ విధంగా 30 సంవత్సరాల పాటు కృషి చేసి 300 ఎకరాలకు పైగా వెదురు, మిగతా భాగంలో ఇతర రకాల చెట్లను పెంచాడు జాదవ్. మొక్కలు పెరిగే కొద్దీ క్రమంగా పక్షులు, పాములు, ఇతర జంతువుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఈ అడవిలో భారతదేశానికే గర్వకారణమైన రాయల్ బెంగాల్ టైగర్స్, దాదాపు 120 ఏనుగులు, ఎలుగుబంట్లు, పాములు, కుందేళ్ళు వంటి జంతువులు బతుకుతున్నాయి. వెయ్యి రకాల వృక్ష సంపద ఆ అడవిలో ఉన్నది.
అడవుల విస్తరణ
1980 నుంచి గోల్‌ఘాట్ జిల్లాలోని ఫారెస్ట్రీ విభాగంతో కలిసి 200 ఎకరాలలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాడు జాదవ్. కొంత మంది కార్మికులతో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టు కాల వ్యవధి ఐదేండ్లు. ఈ కాలం తర్వాత ఇతర కార్మికులు వెళ్లిపోయినప్పటికీ జాదవ్ ఒక్కడే.. అక్కడే ఉండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అడవిని విస్తరించాడు. అసోంలోని మిషింగ్ తెగకు చెందిన జాదవ్ నిస్వార్ధంగా, తన విలువైన సమయాన్ని, శక్తిని ఉపయోగించి అటవీ విస్తరణకు అవిరళ కృషి చేశాడు. తన స్నేహితులు వివిధ ఉద్యోగాలలో స్ధిరపడ్డారు. కానీ జాదవ్ కొన్ని ఆవులు పెంచుకుంటూ, వాటి పాల ద్వారా వచ్చే ఆదాయంతో భార్య, ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను సృష్టించిన అడవిలోనే ఒక గుడిసె లాంటి చిన్న ఇంట్లో నివసిస్తున్నారు జాదవ్ కుటుంబం. తాను చేస్తున్న పని కంటే ఏదీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదని చెపుతున్నాడు ఈ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా.
అవార్డులు, గుర్తింపు
2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఇతని కృషిని గుర్తించి 2012లో స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, జేఎన్‌టీయూ వారు సత్కరించారు. జేఎన్‌యూ వైస్ చాన్సెలర్ సుధీర్ కుమార్ సోపొరి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదుతో జాదవ్‌ను సత్కరించారు. విద్యా వ్యవస్థలో ప్రతి విద్యార్థి, ప్రతి సంవత్సరం కనీసం 2 మొక్కలు నాటాలని సూచిస్తున్నాడు జాదవ్. ఇలా చేయకుంటే అతను తన క్లాస్ లో ఫైయిల్ అయినట్టుగా ప్రకటించేట్లుగా ఒక విధానం తీసుకురావాలని కోరుకుంటున్నాడు. దీనివల్ల వాతావరణం బాగుండటమే కాకుండా చిన్నతనం నుంచే పిల్లలకు పర్యావరణంపై ఒక అవగాహన వస్తుందని చెబుతున్నాడు. తాను పునరుద్ధరించిన అడవికి అతని పేరే పెట్టారు. కృషి, సంకల్పం ఉంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించవచ్చు అనడానికి జాదవ్ పయెంగ్ ఒక ఉదాహరణ.