Politics

నేడు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ ఎన్నికల ప్రచారం

నేడు మూడు నియోజకవర్గాల్లో  రేవంత్ ఎన్నికల ప్రచారం

నేడు మూడు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బోథ్, నిర్మల్, జనగాం నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మూడు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు బోథ్ బహిరంగసభ రేవంత్ మాట్లాడి.. అనంతరం మధ్యాహ్నం 1గంటలకు నిర్మల్ సభ లో పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తరువాత సాయంత్రం 4గంటలకు జనగాంలో బహిరంగసభల్లో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

కామారెడ్డిలోని రెడ్డిపేటలో నిన్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటరన్న మేలుకో.. నిరుద్యోగిని కాపాడుకో అంటూ నిరుద్యోగులు బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నారన్నారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని నిరుద్యోగులు భావించారని, కానీ పదేళ్లలో కేసీఆర్ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదన్నారు రేవంత్‌ రెడ్డి. పరీక్ష పత్రాలు లీక్ అయి జిరాక్స్ సెంటర్ లలో అమ్ముకుంటుంటే.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్య చేసుకున్న ఏ కుటుంబాన్నైనా కేసీఆర్ గానీ, ఎమ్మెల్యేలు గానీ పరామర్శించారా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ట్యాంక్ బ్యాండ్ పై రైతు ఉరి వేసుకుని చనిపోతే పరామర్శించిన నాధుడు లేడు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు.. రైతులు అడ్డుకుంటే పోలీసులతో కొట్టించిండ్రు తప్ప బీఆరెస్ నేతలు అండగా నిలవలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి తమ పూర్వీకుల ఊరు అని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు.

ఊరిమీద పడి రక్తం తాగే పులిని చంపడానికి వేటగాడిని తీసుకొచ్చినట్లు… కామారెడ్డిపై పడి మీ భూములు కాజేయాలని చూస్తున్న కేసీఆర్ ను వేటాడటానికి నన్ను అధిష్టానం ఇక్కడికి పంపింది. పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను కామారెడ్డి పొలిమేరలకు తరమడానికే నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. కామారెడ్డిలో మీ భూములను కాపాడే బాధ్యత నాది. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం కేసీఆర్ వస్తే మీ భూములు పోతాయ్.. మీ పిల్లలకు ఉద్యోగాలు రావు.. అడవిపందుల నుంచి పంటను కాపాడుకున్నట్లు… మీ ఓట్ల కంచెతో కామారెడ్డిని కాపాడుకునే బాధ్యత మీది. మీరు అండగా ఉంటే కేసీఆర్ తాత వచ్చినా కామారెడ్డిలో కాలు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z