తొలి రోజుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు నటించడం కూడా తెలియదని, ఎక్కువగా భయపడేవారని నటి సుహాసిని పేర్కొన్నారు. కె.బాలచందర్ 89వ జయంతి కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ ‘నేను తొలిసారిగా చూసిన సినిమా షూటింగ్ ‘మూండ్రు ముడిచ్చు’. మా ఇంటి వెనకే ఆ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాలో నటించిన రజనీకాంత్ అప్పట్లో పరిశ్రమకు కొత్త. అందువల్ల ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. బాలచందర్ అంటే రజనీకి భయమెక్కువ. షూటింగ్ బ్రేక్ సమయంలో మా ఇంటి తలుపు పక్కన నిలుచొని పొగ తాగేవారు. అప్పట్లో రజనీకి కెమెరా లుక్ పెట్టడం చాలా కష్టమైన పని. ‘కింద చూడు’, ‘పైన చూడు’ అంటూ కె.బాలచందర్ ఆయనకు నటన నేర్పారు. రజనీకాంత్‌తో పాటు చాలా మందికి ఆయనే నటన నేర్పించారు. అంతేకాకుండా బాలచందర్ చెప్పినందుకే నేను మణిరత్నంను పెళ్లి చేసుకున్నా’ అని చెప్పారు.
రజనీకి నటన వచ్చేది కాదు
Related tags :