Politics

సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానం

సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానం

సంపద పెంచుకుంటూ..పేదలకు పంచుకుంటూ భారాస ప్రభుత్వం ముందుకు సాగుతోందని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం మెదక్‌లో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. భారాస పుట్టిందే ప్రజల సంక్షేమం కోసమని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు.

‘‘ప్రజల డబ్బును రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. రైతు బంధు ఉండాలంటే పద్మా దేవేందర్‌రెడ్డి గెలవాలి. 24 గంటల కరెంటు వేస్ట్‌ అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంటు ఉండాలా? వద్దా?. సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే సాగుకు 3గంటల కరెంటు చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. రైతుల వద్ద 3హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లు 30లక్షలు ఉన్నాయి. అవన్నీ మార్చి.. 30 లక్షల 10హెచ్‌పీ మోటార్లు ఎవరు కొనిస్తారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. మీ ఓటుతోనే, మీ వేలుతోనే మీ కన్ను పొడవాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది. రాజకీయాలను సులభంగా తీసుకోవద్దు. రాజకీయం అంటే సినిమా కాదు.. చాలా గంభీరమైన విషయం. రైతు బంధు ఉండాలంటే మళ్లీ భారాస గెలవాలి. ధరణి పోర్టల్‌ ఉండటం వల్లే రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. మనల్ని రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్‌.. రూపం మార్చుకుని వస్తోంది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z