DailyDose

విశాఖ రాజధాని పేరుతో టోకరా

విశాఖ రాజధాని పేరుతో టోకరా

విశాఖపట్నం రాజధాని అవుతోంది.. రూ.లక్షల్లో పెట్టుబడి పెడితే రూ.కోట్ల లాభాలు లాగేయవచ్చునంటూ ఓ వ్యక్తిని రూ.లక్షల్లో ముంచేసిన విశాఖపట్నంకు చెందిన పలువురిపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. సింహాద్రి శ్రీనివాసరావు కృష్ణా జిల్లా అవనిగడ్డ నివాసి. ఇతని తండ్రి పోతురాజు పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్‌ అయిన తర్వాత ఇతనికి ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు అందాయి. పోతురాజుకు కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో కుమారుడు శ్రీనివాసరావు యనమలకుదురులోని బంధువుల ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నాడు. తండ్రి రిటైర్‌మెంట్‌ డబ్బుతో కుమారుడు శ్రీనివాసరావు ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకొంటుండగా.. కొద్ది రోజుల కిందట ఓ వ్యక్తి తన పేరు అచ్యుతరామిరెడ్డి అని, తాను పంచాయతీరాజ్‌ శాఖలో పీఏగా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. విశాఖపట్నం రాజధాని కాబోతోందని చుట్టుపక్కల స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోందని నమ్మబలికాడు. రూ.లక్షల్లో పెట్టుబడి పెడితే రూ.కోట్లలో లాభాలు వస్తాయని ఊదరగొట్టాడు. ఇందుకు శ్రీనివాసరావు అంగీకరించడంతో కొద్దిరోజుల కిందట అచ్యుతరామిరెడ్డి, మరికొందరు యనమలకుదురు వచ్చి శ్రీనివాసరావును కలుసుకొని కొన్ని డాక్యుమెంట్లు చూపారు. సదరు స్థలం లేఔట్‌ పనులు జరుగుతున్నాయని ముందుగా కొంత మొత్తం ఇవ్వాలంటూ కోరడంతో ఇతని మాటలు నమ్మిన శ్రీనివాసరావు రూ.7.80 లక్షలను విడతల వారీగా అతను సూచించిన బ్యాంకు ఖాతాలకు పంపాడు. స్థలాన్ని రిజిస్టర్‌ చేయించుకోవడానికి గత నెల రోజులుగా శ్రీనివాసరావు పలుసార్లు అచ్యుతరామిరెడ్డి, ఇతని స్నేహితులకు ఫోన్‌ చేస్తున్నా అవి పనిచేయకపోవడం, తనకు చూపిన డాక్యుమెంట్లు నకిలీవని అనుమానించడంతో పాటు మోసపోయినట్లు గుర్తించి బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అచ్యుతరామిరెడ్డి, ఇతని స్నేహితులు వెలమల నారాయణరావు, సునీల్‌కుమార్‌, మధురేశ్వరమ్‌, జగదీష్‌, గుడ్ల గురునాథ్‌లపై పోలీసులు మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుందరూ విశాఖపట్నం, పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z