నేడు తొలిఏకాదశి… విశిష్టత – ఆద్యాత్మిక వార్తలు
ఆ రోజున ఏం చేయాలి.హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని *‘‘తొలి ఏకాదశిగా’’* గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. పురాణాలను అనుసరించచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు..ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు… పర్వదినాలు ఎక్కువగా వస్తాయి.. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు,.
*ఏకాదశి తిథి….. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.
*ఏకాదశి నాడు ఏం చేయాలి…. ఏకాదశి నాడు ఉపవాసం ఉంది.. ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి..
*పేలాల పిండి…… తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.
1. 16న తిరుమలలో అన్నప్రసాద వితరణ నిలిపివేత
చంద్రగ్రహణం కారణంగా ఈనెల 16న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోజు రాత్రి 7 గంటల నుంచి 17న ఉదయం 9 గంటల వరకు అన్నప్రసాద వితరణ కేంద్రాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనం, యాత్రిసదన్-2, వైకుంఠం-2, దేవస్థానం ఉద్యోగుల క్యాంటీన్, శ్రీపద్మావతి విశ్రాంతి భవనం, ఎస్వీ విశ్రాంతి భవనంలో అన్నప్రసాద వితరణ నిలిపివేయనున్నట్లు తెలిపింది. 16న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు పులిహోర, టమోటా రైస్ పొట్లాలను ప్రత్యేకంగా అందించనుంది. చంద్రగ్రహణం కారణంగా 16న దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. 16న శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, 17న ఆణివార ఆస్థానం కారణంగా కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసింది. ప్రతి పౌర్ణమి రోజున జరిగే పున్నమి గరుడసేవను సైతం 16న రద్దు చేసింది.
2. 16న కాణిపాకం ఆలయం మూసివేత
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 16వ తేదీన మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు తెలిపారు.
3. చినవెంకన్న ప్రసాదాలకు ఐఎస్వో గుర్తింపు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రానికి వరుసగా రెండో ఏడాదీ ఐఎస్వో గుర్తింపు లభించింది. ఇక్కడ కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలను అందిస్తున్నందుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఐఎస్వో 22200:2018 ధ్రువపత్రాన్ని అందించింది. దేవస్థానం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు గతేడాది ఐఎస్వో ధ్రువపత్రం లభించింది.
4. శ్రీమాన్ న్యాయసుధా పారాయణం ప్రారంభం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీమాన్ న్యాయసుధా పారాయణం బుధవారం ఉదయం 6 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. శ్రీజయతీర్థుల ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14 వరకు, తిరిగి 18 నుంచి ఆగస్టు 22 వరకు శ్రీవారి ఆలయంలో పారాయణం జరుగుతుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పండితులు పారాయణం చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని శ్రీవిమాన వేంకటేశ్వరస్వామివారికి ఎదురుగా 11 మంది వేద పారాయణదారులు సకల శాస్త్రాలను పారాయణం చేస్తారు. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు ఉంటాయి. లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీవారి సన్నిధిలో న్యాయసుధా పారాయణం కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా తితిదే నిర్వహిస్తోంది
5. గోదారమ్మకు పూజలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాణహిత జలాలు మంథనికి చేరాయి. మేడిగడ్డ నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీరు చేరడంతో మంథని తీరాన్ని తాకాయి. గురువారం గౌతమీ తీరంలో గోదారమ్మకు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూజలు చేశారు.
6. అమర్నాథ్ యాత్రకు హెలికాప్టర్ సేవలు!
జమ్ము కశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 4వ తేదీన శంషాబాద్ నుంచి విమానంలో దిల్లీకి పయనంతో యాత్ర ప్రారంభమవుతుంది. దిల్లీ నుంచి శ్రీనగర్… అక్కడి నుంచి నీల్గ్రత్కు రోడ్డు మార్గంలో వెళ్తారు. 5వతేదీన హెలికాప్టర్ ద్వారా యాత్రికులు పంచతర్ణి చేరుకుంటారు. కాలినడకన అమర్నాథ్ ఆలయానికి చేరతారు. మంచు లింగం దర్శనం అనంతరం ఏడో తేదీ రాత్రి హైదరాబాద్ తిరిగి వస్తారు. వివరాలు ..040-27702407, 9701360701 నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. www.irctctourism.com వెబ్సైట్లోనూ ఉన్నాయి.
7. నేటి సామెత
*ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే*
ఢిల్లీ అంతటి నగరానికి రాజైనా ఓ తల్లికి కొడుకే. అలాగే మనం ఎంత గొప్పవారమయినా మన మూలాల్ని, గతాన్ని మర్చిపోకూడదు అని దీని అర్థం.
8. నేటి సుభాషితం
*వేలాది వ్యర్ధమైన మాటలు వినటం కన్నా… శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు.*
9. నేటి జాతీయం
*కంటి మీద కునుకు లేదు*
విరామమే లేదు.కాస్త కూడా తీరిక లేనంత పనివుంటే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
10. నేటి ఆణిముత్యం
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలలితము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
*తాత్పర్యం:
సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.
11. శుభోదయం
“గెలవాలన్న స్ఫూర్తితో పోరాడు..ఓడినా తట్టుకోగలవు. గెలిచి తీరాలన్న అహంతో పోరాడకు… ఓడిపోతే తట్టుకోలేవు.”
12. మన ఇతిహాసాలు బ్ర హ్మ క పా
“శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ,ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు….మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!,దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది.కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది.అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు…క్రమక్రమంగా ఎండి,చివరికది,కపాలంగా మారిపోయింది….బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే , అది సరాసరిబ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది.జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు.దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.’దేవాదిదేవా ! పరమజ్ఞామివి. నీకు తెలియని ధర్మం లేదు.ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి .శాసించగలవాడివి.అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోరావు.కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము…ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళూ కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ..మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా !ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ? అని అడిగాడు.నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు.?పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు.ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.’పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు .ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే – అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట . ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది.అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం.చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం.దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.దానికితోడు నాశక్తి , శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.’అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే ! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.
తమ పిత్రుదేవతలను పునరావ్రుతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!……
13. తొలిఏకాదశి : ఆలయాలకు పోటెత్తిన భక్తులు
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం, తొలిఏకాదశి కావడంతో ఎల్లమ్మ, పోచమ్మలను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు జనం. శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు అర్చకులు. ఆలయంలో ఆషాడ సందడిపై మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు.
14. తిరుమల శ్రీవారి సేవలో మరోమారు పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా – తిరుమల ప్రత్యేక అధికారి ఎ.వి.ధర్మారెడ్డి నాపై నమ్మకం ఉంచిన సిఎంకు ధన్యవాదాలుటిటిడి ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తాకలిసికట్టుగా పనిచేసి సామాన్య భక్తులకు సేవ చేస్తా.
15. రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం – టిటిడి ఇఓ అనిల్ కుమార్ సింఘాల్రెండవసారి రాష్ట్రపతి హోదాలో శ్రీవారిని రామ్ నాథ్ కోవింద్ దర్శించుకుంటారుతిరుచానూరు, కపిలేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్రపతి దర్శించుకుంటారు
తిరుచానూరులో నిర్మించిన టిటిడి వసతి గృహాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు
16. చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం(16వ తేదీ) రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. బుధవారం తెల్లవారుజామున (ఉదయాత్పూర్వం) 1.31 గంటల నుంచి 4.29 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణం ప్రారంభమయ్యే 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. దీంతో మంగళవారం సాయంత్రం సరిగ్గా 7 గంటలకు మూడు ప్రధాన ద్వారాలను మూసివేస్తారు. గ్రహణం వీడిన తరువాత బుధవారం(17వ తేదీ) ఉదయం 5 గంటలకు తెరుస్తారు
17. ఏళ్లకోసారి మాత్రమే దక్కే అత్తివరదర్ దర్శన భాగ్యం కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తమిళనాడుకు రానున్నారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అత్తివరదర్‌ను దర్శించుకునేందుకు శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి హెలికాప్టర్లో కాంచీపురం చేరుకుంటారు. అత్తివరదర్ దర్శనానంతరం శనివారం సాయంత్రం రాష్ట్రపతి తిరుపతికి వెళతారు. రాత్రికి కొండపైనే బసచేసి, ఆదివారం ఉదయం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తిరుచానూరులో కొత్తగా నిర్మించిన పద్మావతి నిలయం విశ్రాంతి గృహ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోటకు వెళతారు. చంద్రయాన్ ప్రయోగం అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు.
18.తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు శుక్రవారం,
12.07.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 23C° – 32℃°
• నిన్న 71,035 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ
నిండినది, భక్తులు బయట
చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
24 గంటలు పట్టవచ్చును
• నిన్న 30,478 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 4.58 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
మూడు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
• ప్రత్యేకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141