మంగళవారం; నటీనటులు: పాయల్ రాజ్‌పూత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమిర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు; సంగీతం: అజనీష్ లోకనాథ్; ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి; సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి; నిర్మాత: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి; విడుదల: 17-11-2023
‘RX 100’తో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాతోనే నటి పాయల్ రాజ్‌పూత్ కూడా తెలుగు వారికి దగ్గరైంది. ఈ చిత్రం తర్వాత ఆమె వరుస సినిమాలు చేసినా… ఏదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు అజయ్ భూపతి కూడా ‘మహాసముద్రం’తో చేదు ఫలితాన్ని రుచి చూశారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పాయల్‌తో కలిసి ‘మంగళవారం’ (Mangalavaram) అనే డార్క్ థ్రిల్లర్‌ను ముస్తాబు చేశారు అజయ్. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. సినిమా టెక్నికల్‌గా చాలా బలంగా కనిపించడం.. అల్లు అర్జున్ వంటి స్టార్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఈ అంశాలన్నీ దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా చేశాయి. మరి ఈ మంగళవారం కథేంటి? తెరపై ఎలాంటి వినోదాన్ని పంచిచ్చింది?(Mangalavaram Movie Review telugu) పాయల్ – అజయ్‌లకు విజయాన్ని అందించిందా?
కథేంటంటే: మహాలక్ష్మీపురంలో వరుసగా రెండు జంటల ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. అదీ ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఊరి గోడలపై రాసిన రాతల వల్లే వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ, ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత) మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని బలంగా నమ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శవాలకు పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఊరి జమిందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ) అడ్డు చెబుతాడు. అతని మాటకు ఊరు కూడా వంత పాడటంతో మొదటిసారి తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. కానీ, రెండో జంట చనిపోయినప్పుడు మాత్రం ఊరి వాళ్లను ఎదిరించి మరీ పోస్టుమార్టం చేయిస్తుంది. మరోవైపు ఊరి వాళ్లు గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. మరి ఊర్లో జరిగినవి ఆత్మహత్యలా? హత్యలా? ఈ చావుల వెనకున్న లక్ష్యం ఏంటి?వీటికి ఆ ఊరి నుంచి వెలివేయబడ్డ శైలజ అలియాస్ శైలు (పాయల్ రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆమె కథేంటి? (Mangalavaram Movie Review telugu) ఊర్లో జరిగే చావులకు ఫొటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమిందారుకు.. అతని భార్య (దివ్యా పిళ్లై)కు ఏమైనా సంబంధం ఉందా? శైలు చిన్ననాటి ప్రియుడు రవి కథేంటి? అన్నది మిగతా కథ.
ఎలా సాగిందంటే: ఇదొక మిస్టీక్ థ్రిల్లర్. మధ్యలో హారర్ టచ్ ఇచ్చి.. ఆ తర్వాత ఓ రివేంజ్ డ్రామాలా కొనసాగించి.. ఆఖర్లో ఓ చిన్న సందేశంతో ముగించారు. ఆ సందేశం ప్రధానంగా మహిళలకు సంబంధించినది. అయితే దాన్ని చెప్పేందుకు అల్లుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. దాన్ని ప్రేక్షకులు ఏ కోణంలో చూస్తారన్న దానిపై చిత్ర ఫలితం ఆధారపడి ఉంది. ముఖ్యంగా దీంట్లోని అక్రమ సంబంధాల వ్యవహారం.. కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు.. కథానాయికకు ఉన్న సమస్య వంటివి ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. ఈ చిత్రంలో కనిపించే ఓ ప్రత్యేకత ఏంటంటే.. విరామం ముందు వరకు ప్రధాన పాత్ర కనిపించకున్నా.. అసలు కథ మొదలు కాకున్నా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ముందుకు నడిపించారు దర్శకుడు అజయ్. శైలు చిన్నతనం ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. రవితో ఆమె చిన్ననాటి ప్రేమకథ.. ఇంట్లో తండ్రితో పడే ఇబ్బందులు.. రవి కుటుంబ నేపథ్యం.. తొలి 15నిమిషాలు వీటితోనే ముందుకు నడిపారు. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది. (Mangalavaram Movie Review) మహాలక్ష్మీపురం.. అందులోని పాత్రల వ్యక్తిత్వాల్ని పరిచయం చేస్తూ నెమ్మదిగా సినిమా ముందుకు సాగుతుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న జంటల పేర్లు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఊరి గోడలపై రాస్తుండటం.. మరుసటి రోజే ఆ జంటలు కన్నుమూయడం.. గ్రామ దేవతకు ఇష్టమైన మంగళవారం రోజునే ఈ చావులు సంభవిస్తున్నాయని ఊరి వాళ్లంతా ఆందోళన చెందడం.. గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు వారంతా రంగంలోకి దిగడం.. ఇలా క్రమంగా ఆసక్తిపెంచుతూ కథ వేగం పుంజుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే విరామ సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.
ద్వితీయార్ధం మళ్లీ శైలు గతంతోనే మొదలవుతుంది. అయితే ప్రథమార్ధంతో పోలిస్తే ఇక్కడి నుంచి కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. కాలేజీలో శైలూకు.. ఇంగ్లీష్ లెక్చరర్ మదన్‌కూ మధ్య నడిచే ప్రేమకథ సోసోగా అనిపిస్తుంది. వీరి మధ్య వచ్చే ఓ రొమాంటిక్ గీతం యువతరానికి నచ్చేలా ఉంటుంది. శైలుకు జరిగిన అన్యాయం.. ఆమెకున్న మానసిక రుగ్మత.. దానివల్ల తను పడే యాతన భావోద్వేగభరితంగా ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఏ కోణంలో చూస్తారన్నది ఆసక్తికరం. పతాక సన్నివేశాలు మంచి ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాని ముగించిన తీరు కాస్త అసంతృప్తిగానే ఉంటుంది.
ఎవరెలా చేశారంటే: శైలు పాత్రలో పాయల్ (Payal Rajput) చక్కగా ఒదిగిపోయింది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రిది. అయితే తను ద్వితీయార్ధంలోనే కనిపిస్తుంది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో చక్కగా జీవించింది. ఎస్సై పాత్రలో నందితా శ్వేత ఆద్యంతం సీరియస్ లుక్‌లో కనిపించింది. అయితే నటన పరంగా ఆమెకు పెద్దగా ప్రతిభ చూపించుకునే ఆస్కారం దొరకలేదు. అజయ్ ఘోష్ – లక్ష్మణ్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. జమిందారుగా చైతన్య కృష్ణ పాత్రను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. అజయ్ రాసుకున్న కథ కుటుంబ ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.
ప్రథమార్ధంలో అసలు కథే కనిపించకపోవడం.. ద్వితీయార్ధంలో చాలా పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం లోపం. హీరోయిన్ చిన్ననాటి ప్రియుడు.. మాస్క్ వెనక మనిషి విషయంలో ఓ మీడియం రేంజ్ స్టార్‌ను రంగంలోకి దించుంటే బాగుండేదనిపిస్తుంది. టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో కనిపిస్తుంది. అజనీష్ నేపథ్య సంగీతం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాటను స్వరపరిచిన తీరు.. దాన్ని తెరపై చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటాయి. అలాగే శివేంద్ర ఛాయాగ్రహణం మరో ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
+ పాయల్ నటన.. గ్లామర్
+ అజనీష్ సంగీతం
+ ద్వితీయార్ధంలో ట్విస్ట్‌లు
బలహీనతలు
– నెమ్మదిగా సాగే కథనం..
– ముగింపు
చివరిగా: మంగళవారం.. బోల్డ్ థ్రిల్లర్ (Mangalavaram Movie Review telugu)
👉 – Please join our whatsapp channel here –