ఇది ఆన్‌లైన్ జమానా. గుండు పిన్ను నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలకు వరకు ఏ వస్తువునైనా ఈ-కామర్స్‌లో కొనుగోలు చేయొచ్చు. అయితే, త్వరలో ఆన్‌లైన్ షాపింగ్‌లో కార్లు కొనుగోలు చేయొచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) వచ్చే ఏడాది నుంచి తమ వెబ్‌సైట్‌లో కార్ల విక్రయాలు ప్రారంభించనుంది. ఈ మేరకు హ్యుందాయ్ (Hyundai) సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హుంద్యాయ్ తన కారు మోడల్స్ వివరాలను అమెజాన్‌లో యూజర్లు అందుబాటులో ఉంచుతుంది. యూజర్లు తమకు నచ్చిన మోడల్ కారును ఎంపిక చేసుకుని, ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాలి. తర్వాత దగ్గర్లోని హ్యుందాయ్ డీలర్ నుంచి కారు డెలివరీ తీసుకోవచ్చు లేదా ఇంటికే డెలివరీ చేస్తారు.
ముందుగా అమెరికాలోని వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. క్రమంగా ఇతర దేశాల్లోని యూజర్లకూ దీన్ని విస్తరించనున్నారు. వివిధ నగరాల్లోని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లకు, కొనుగోలుదారులకు మధ్య వారధిలా అమెజాన్ వ్యవహరిస్తుంది. ఇదే విధంగా ఇతర కంపెనీల కార్లు విక్రయించేందుకు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెజాన్ తెలిపింది. రెండు సంస్థల భాగస్వామంలో 2025 నాటికి హ్యుందాయ్ అన్ని మోడల్స్‌లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దాంతోపాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా హ్యుందాయ్ కార్లలో క్లౌడ్ ఆధారిత సేవలను అందివ్వనున్నట్లు వెల్లడించింది.
‘‘వినియోగదారులకు మెరుగైన, సులభతరమైన సేవలను అందించాలన్న అమెజాన్ ఆలోచనకు హ్యుందాయ్ వంటి సంస్థ తోడవడం ఎంతో సంతోషంగా ఉంది. రెండు సంస్థల భాగస్వామ్యంతో వినియోగదారులు ఆన్‌లైన్‌లో సులువుగా కార్లు కొనుగోలు చేయొచ్చు. దాంతోపాటు అలెక్సా సాయంతో హ్యుందాయ్ కస్టమర్లు.. ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, స్మార్ట్‌హోమ్ ఉపకరణాల నియంత్రణ, షెడ్యూలింగ్ వంటి ఎన్నో పనులు చేయొచ్చు. అమెజాన్-హ్యుందాయ్ భాగస్వామ్యంలో భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు తీసుకొస్తాం’’ అని అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ తెలిపారు.
అమెజాన్ కంపెనీ గత కొంత కాలంగా ఆటోమొబైల్ రంగంలోని పలు ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలతో కలిసి వర్చువల్ షోరూమ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. వీటి ద్వారా యూజర్లు కార్లతోపాటు, విడిభాగాలు, యాక్ససరీలను కొనుగోలు చేయొచ్చు.
👉 – Please join our whatsapp channel here –