ప్రపంచంలోనే అతిపెద్ద ఏసీ తయారీ సంస్థ.. జపాన్‌కు చెందిన డైకిన్ ఇక నుంచి మేడిన్ ఆంధ్రా ఏసీలను విక్రయించనుంది. ఈ మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీసిటీలో జపాన్ కంపెనీ ప్రతినిధులు, రాయబారుల సమక్షంలో నవంబర్ 23న లాంఛనంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 75.5 ఎకరాల విస్తీర్ణంలో డైకిన్ ఈ యూనిట్‌ను స్థాపించింది. గతేడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభించిన డైకిన్ రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే యూనిట్‌ను సిద్ధం చేసింది.
తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనిట్లలో 75 శాతం నియామకాలు స్థానికులకే ఉండాలన్న ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో డైకిన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2020–21లో డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని డైకిన్ వెల్లడించింది. ఎంపికైన ఉద్యోగులకు రూ.1.99 లక్షల వార్షిక వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –