Politics

సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం మొదలైంది!!

సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం మొదలైంది!!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్వాగతించారు. ఈ మేరకు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా ఆయన స్పందించారు. ‘‘సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలైంది. మన నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యం. చంద్రబాబు నీతి, నిజాయతీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయి. తప్పు చేయను.. చేయనివ్వను.. అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయి. 50 రోజులైనా ఒక్క ఆధారమూ కోర్టు ముందు ఉంచలేకపోయారు. కుట్రలు, కుతంత్రాలు న్యాయం ముందు ఓడిపోయాయి. ఈ కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు లేవని తేలిపోయింది. చంద్రబాబు రాజకీయ జీవితంపై మచ్చ వేసేందుకు కుట్ర చేశారని తేలిపోయింది’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు: అచ్చెన్న
అక్రమ కేసులపై తమ పోరాటం ఫలించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని నిరూపితమైందని చెప్పారు. ఇకనైనా సీఎం జగన్ బుద్ధి తెచ్చుకుని కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తారని అచ్చెన్న తెలిపారు.

ఆనందం కంటే ఆ బాధే ఎక్కువ: తెదేపా నేతలు
చంద్రబాబు 29 నుంచి పులిలా ప్రజల్లోకి వస్తారని తెదేపా నేతలు తెలిపారు. బెయిల్ వచ్చిందన్న ఆనందం కంటే 50 రోజులకు పైగా అన్యాయంగా ఆయనను జైల్లో నిర్బంధించారనే బాధే ఎక్కువగా ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంపై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ వద్ద తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం బాణసంచా పేల్చి నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.

అవినీతి ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేకే పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపే యత్నం చేసి దెబ్బతిన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అవినీతి బురద చల్లడం వైకాపా తరం కాదని తేల్చిచెప్పారు. చంద్రబాబు పూర్తి స్థాయి కార్యక్రమాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ లోపు మిగిలిన కేసుల్లోనూ బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామని నేతలు తెలిపారు. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z