DailyDose

విమానంలో మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన-నేర వార్తలు

విమానంలో మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన-నేర వార్తలు

విమానంలో మద్యం మత్తులో అసభ్య ప్రవర్తన

విమానాల్లో (Flights) మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి మద్యం మత్తులో సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇండిగో (IndiGo)కు చెందిన ఓ విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల ఇండిగో విమానం ‘6E 556’ జైపుర్‌ నుంచి బెంగళూరు (Jaipur to Bengaluru)బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికి ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో విమాన సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా అతని తీరు మాత్రం మారలేదు. దీంతో తోటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలిగింది. విమానం ల్యాండింగ్‌ అనంతరం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందించింది. విమానంలో జరిగిన ఘటనను వివరించింది. ‘‘ఈ ఘటన కారణంగా ప్రయాణానికి ఎంతో ఇబ్బంది కలిగింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేమెంతో చింతిస్తున్నాం’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. విమానాల్లో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం తొలిసారి కాదు. గతంలో ఓ ప్రయాణికుడు మరో మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. పలుమార్లు ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుణ్ని అరెస్టు చేశారు.

బీజేపీ కార్యకర్తల వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

బీజేపీ కార్యకర్తల వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి చేసిన ఘటన కామరెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామారెడ్డి మండలానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఎల్లారెడ్డి సమావేశానికి వెళుతుండగా.. గర్గుల్ గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ర్యాలీ నడుస్తుంది. రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒక పక్కకు ఆపుకున్న బీజేపీ కార్యకర్తలకు చెందిన తుఫాన్ వాహనంపై ర్యాలీలోని కొందరు రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు పగిలి అందులోని పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై దేవునిపల్లి ఎస్ఐ రాజు వివరణ అడగగా తమకైతే ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల్లో 1760 కోట్లు పట్టివేత

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Five states Election) నేపథ్యంలో ఓటర్లకు ప్రలోభాల విషయంలో ఎన్నికల సంఘం (Election Commission) పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.1760 కోట్ల విలువైన లెక్కచూపని నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. 2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్‌ చేసిన దాంతో(రూ.239.15 కోట్లు) పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని పేర్కొంది. అత్యధికంగా తెలంగాణ (Telangana)లో దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్‌ చేసినట్లు ఈసీ అంచనా వేసింది.అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో ఈ నెల 25న, తెలంగాణలో 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈసీ వివరాల ప్రకారం తెలంగాణలో సీజ్‌ చేసిన మొత్తంలో రూ.225.23 కోట్లు నగదు రూపేణా ఉన్నాయి. రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులను జప్తు చేశారు. మిజోరంలో నగదు దొరక్కపోవడం గమనార్హం. కానీ, రూ.29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది.

* ఐదేళ్ల చిన్నారి హత్య

పొరుగింటి మహిళపై పగతో ఆమె ఐదేళ్ల కొడుకుని హతమార్చిన మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే…ముజఫర్‌నగర్ జిల్లాలో తేవ్రా గ్రామానికి చెందిన ఆసిఫా అనే మహిళ.. పొరిగింట్లో ఉంటున్న దినిస్టా బేగంపై పగతో ఆమె ఐదేళ్ల కుడుకు అర్సలాన్‌ని కిడ్నాప్‌ చేసి హత్య చేసింది. నవంబర్ 11న బాలుడు అదృశ్యం కాగా మూడు రోజుల తరువాత కక్రౌలీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామ శివార్లలో అడవిలో  గోనె సంచిలో అర్సలాన్‌ మృతదేహం లభ్యమైంది.అర్సలాన్‌ను హత్య చేసినట్లు విచారణలో  అసిఫా అంగీకరించిందని కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బయట ఆడుకుంటున్న అర్సలాన్‌ను ఆసిఫా కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించింది. గ్రామమంతా వెతికిన బాలుడి తండ్రి షాజాద్ ఖాన్ ఆచూకీ దొరక్కపోవడంతో కక్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు గ్రామశివార్లలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లుగా కేసు నమోదు చేశారు. తర్వాత ఆసిఫా ఇంట్లో బాలుడి టోపీ, చెప్పులు, గొంతుకు బిగించేందుకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాను తమదైన శైలిలో పోలీసులు విచారించగా బాలుడిని చంపింది తానే అని ఒప్పుకుంది. అర్సలాన్‌ తల్లి దనిస్టా బేగం తనను అగౌరవంగా చూసేదని, తరచూ అవమానించేదని, అందుకు ఆమె కొడుకుని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది.

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్న ఓ వ్యక్తి

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై హిమబిందు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మణికంఠ.. తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దుర్గని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల అభయ్ అనే పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. మూడు నెలలు క్రితం భర్తతో దుర్గ విభేదించి తిరుపతి చేరుకుంది. అక్కడ సోనూ అలియాస్ బాషాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సహజీవనం చేస్తున్న వారిద్దరూ.. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో మకాం పెట్టారు.ఈ విషయం తెలుసుకున్న భర్త మణికంఠ.. చంద్రగిరి పీఎస్‌కు చేరుకుని కానిస్టేబుల్ శ్రీనివాసులను నిలదీశాడు. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానని కానిస్టేబుల్ బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ.. పీఎస్‌ పక్కనే ఉన్న బంక్ నుంచి 5 లీటర్ల పెట్రోల్‌ తీసుకొచ్చి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలతో అలాగే స్టేషన్‌లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. పోలీసులు, స్థానికులు ఆ మంటలను ఆర్పారు. 108 అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో పశు వైద్య సంచార వాహనంలో మణికంఠను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

ఓ ప్రేమ జంట రైలు పట్టాలపై ఆత్మహత్య

పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదనో లేక మరే ఇతర కారణాలతోనో తెలియదు కానీ ఓ ప్రేమ జంట రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు పట్టాలపై ఇద్దరు మృతదేహాలను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషాదఘటన తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్‌ పరిధిలో జరిగింది. గూడూరు-కొండాగుంట రైల్వేస్టేషన్‌ల మధ్య తిరుపతి మార్గంలో దిగువ రైలు పట్టాలపై యువతీ, యువకులు చనిపోయి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. రైలు పట్టాలు, మృతుల వద్ద లభించిన ఆధారాల ప్రకారం యుకుడిది పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడుకు చెందిన దండే రాకేష్‌(23), పల్నాడు జిల్లా మాచవరం మండలం రుక్మిణిపురానికి చెందిన అన్నంగి పావని(19)గా గుర్తించారు. గూడూరు సమీపంలోని టిడ్కో భవన సముదాయం వెనుక వైపు ఉన్న రైలు పట్టాలపై వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. మృతులు ప్రేమజంటగా భావిస్తున్నట్లు తెలియజేశారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారా.. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కామవాంఛే అతని ప్రాణం తీసింది

ఆమెకు పెళ్లయింది.. కానీ.. అతనికి మాత్రం పెళ్లి కాలేదు.. దీంతో కామవాంఛ తీర్చాలంటూ వివాహిత వెంటపడ్డాడు.. వేధించాడు.. ఆమె సర్దిచెప్పినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు.. పదే పదే విసిగిస్తుండటంతో.. ఆమె ఈ విషయాన్ని కట్టుకున్న భర్తకు చెప్పింది.. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి స్కెచ్ వేశారు.. చివరకు ఇంటికి పిలిచి మరి లేపేశారు.. హత్య అనంతరం దంపతులు పారిపోగా.. ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దంపతులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నిజాంవలి కాలనీలోని పుట్టగడ్డ వీధిలో ఈ నెల 12వ తేదీన శ్రీకాంత్(23) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. తాళం వేసి ఉంచిన ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సంచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రక్తపు మడుగులో పడి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని గుర్తించారు. మూడు రోజుల క్రితమే హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి నిందితులు పరారైనట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. శ్రీకాంత్ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. శ్రీకాంత్ తన దగ్గర బంధువు అయిన రామాంజనేయులు భార్య హనుమక్కను తన కామవాంఛ తీర్చాలంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది.శ్రీకాంత్ లైంగిక వేధింపులు తట్టుకోలేక.. తన భర్త రామాంజనేయులుకు హనుమక్క ఈ విషయం గురించి చెప్పింది. దీంతో తన భార్యను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న శ్రీకాంత్ పై రగిలిపోయాడు. ఆ తర్వాత రామాంజనేయులు దంపతులు.. ఎలాగైనా శ్రీకాంత్ ను హత్య చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్లాన్ లో భాగంగా దీపావళి పండుగకు ఇంటికి రావాలని హనుమక్క.. శ్రీకాంత్ కు ఫోన్ చేసింది. శ్రీకాంత్ ను ఇంటికి రప్పించిన హనుమక్క.. అనుకున్న దాని ప్రకారం ప్లాన్ ను అమలు చేసింది.ప్లాన్ ప్రకారం శ్రీకాంత్ కు ఎక్కడా అనుమానం రాకుండా భోజనం పెట్టింది. ఈ క్రమంలో శ్రీకాంత్ భోజనం చేస్తుండగా రామాంజనేయులు రోకలి బండతో తలపై బాదాడు. అనంతరం ఇద్దరూ కలిసి శ్రీకాంత్ ను హత్య చేశారు. శ్రీకాంత్ చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఇంట్లో తాళం వేసి దంపతులు పరారయ్యారు. శ్రీకాంత్ లైంగిక వేధింపులు భరించలేక రామాంజనేయులు అతని భార్య హనుమక్క ప్లాన్ ప్రకారమే దీపావళి పండుగకు ఇంటికి పిలిపించుకుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z