కార్తికమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు చేసే తెలుగు సంప్రదాయాన్ని ఖతార్‌లోని ప్రవాసులు కొనసాగించారు. అల్ ఖోర్ నగరంలోని అతిపెద్ద ఉద్యానవనంలో కార్తిక వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. నేటి తరానికి తెలుగు సంప్రదాయాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలతో అలరించారు. తెలుగు వంటకాలను అరటి ఆకులో వడ్డించి, ఒకేసారి వందలమంది కుటుంబసభ్యులతో కలసి, నేలమీద కూర్చొని భోజనం చేశారు. అది చూసి ఖతార్ దేశీయులు ఎంతో అబ్బురపడ్డారనీ, తెలుగు వంటకాలు ఎంతో రుచిగా ఉన్నాయంటూ కొనియాడారని నిర్వాహకులు తెలిపారు.
ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులందరికీ బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఉదయం అల్పాహారంతో మొదలైన ఈ కార్యక్రమం సాయంత్రం చిరుతిళ్లతో ముగిసింది. ఈ అపూర్వ కుటుంబ సమ్మేళనంలో పాలుపంచుకున్న వారంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడున్నా.. తెలుగువాళ్లు తమ మూలాలను మరచిపోరని, సందర్భం వచ్చినప్పుడల్లా వాటిని తర్వాతి తరానికి నేర్పించే ప్రయత్నం చేస్తుండటం సంతోషాన్నిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన బొడ్డు రామారావు, ఆయనకు సహకరించిన రవి పొనుగుమాటి , శ్రీనివాస బాబు తమ్మిన, జేవీవీ సత్యనారాయణ, సుధాకర్ బాబు కొడాలి, యరమంచిలి శాంతయ్య, గొట్టిపాటి రమణయ్య, మద్దిపోటి నరేష్, బొండ్లపాటి రజని, దేవినేని ప్రజ్వుల తదితరులకు పేరుపేరునా అభినందనలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –