* కేటీఆర్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన ప్రచార తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాల్లో, ఇంటర్వ్యూలలో, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ప్రభుత్వ భవనమైన టీ హబ్‌లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీ హబ్‌లో సమావేశంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన కాంగ్రెస్ బృందం పేర్కొంది.
* ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ టాప్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నందున అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా పెద్ద మొత్తంలో నగదును ఆయా పార్టీల అభ్యర్థులు సమకూర్చుకోవడంలో బీజీ అయ్యారు. ఇదే క్రమంలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరంలను దాటేస్తూ మన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో డబ్బు పట్టుబడింది.అక్టోబర్ 10 నుంచి కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణలో ఇప్పటి వరకు రూ.659.2 కోట్ల ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. రాజస్థాన్ లో 650.7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. ఐదు రాష్ట్రాల్లో 372.9 కోట్ల నగదు పట్టుబడగా ఒక్క తెలంగాణలోనే రూ.225.23 కోట్లు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో రూ.1760 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మిగిలిన వాటిలో మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కార్యకర్తలు, ప్రధాన అనుచరుల ఇళ్లలో నాయకులు భారీగా డబ్బును ఉంచుతున్నారు. ఎన్నికలకు ముందు రోజు రాత్రి కళ్లా ఎలాగైనా తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేలా ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు స్కెచ్ వేస్తున్నారు.
* జమిలితో ప్రజలకే ప్రయోజనం
జమిలి ఎన్నికల పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు దేశప్రయోజనాలతో ముడిపడిన అంశమని అన్నారు. జమిలితో దేశప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కోవింద్ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఒకే దేశం – ఒకే ఎన్నికకు మద్దతు తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను రామ్‌నాథ్ కోవింద్ కోరారు. ప్రజలు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉన్నవారికి కూడా మేలు జరుగుతుందని వివరించారు.‘దేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నన్ను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి జమిలి ఎన్నికలు అమలు చేయడంపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. ఇప్పటికే దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తీసుకున్నాం. అన్ని పార్టీలూ ఏదో ఒక సమయంలో జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికలు అమలు చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే మేలు జరుగుతుంది. అది బీజేపీ కావొచ్చు.. కాంగ్రెస్ కావొచ్చు. లేదా మరే ఇతర రాజకీయ పార్టీ అయినా కావొచ్చు. అందులో ఎటువంటి వివక్షా లేదు. ముఖ్యంగా ప్రజలే దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒకేసారి ఎన్నికల ద్వారా డబ్బు ఆదా అవుతుంది. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగించవచ్చు. ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలతో ముడిపడింది కాదు. అందుకే దేశానికి మేలు జరిగేలా నిర్మాణాత్మకంగా సహకరించాలని అన్ని పార్టీలను అభ్యర్థిస్తున్నాం’ అని అన్నారు. కాగా, దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తున్నది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు జమిలి ఎన్నికలతో ప్రయోజనాలు ఉన్నాయంటే, ఇంకొందరేమో జమిలి ఎన్నికలతో ఒరిగేదేమీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ కోసం కేంద్రం కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తున్నారు.
* రాముడి సేవకు పూజారులు కావలెను
అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరంలో పూజారుల కోసం రామ్ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్హత కలిగిన పూజారుల నుంచి కోరిన దరఖాస్తులకు ఊహించని స్పందన వచ్చింది. రాముడి సేవకు గాను 20 మంది పూజారులు కావలెనని పత్రికా ప్రకటన ఇవ్వగా దీనికోసం సుమారు 3 వేల మంది అభ్యర్థులు దీనికోసం దరఖాస్తు చేసుకున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటికే 200 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్టు వారికి త్వరలోనే ముఖాముఖి (ఇంటర్వ్యూ) నిర్వహించనున్నట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెడ్ క్వార్టర్స్‌లోని కరసేవక్‌పురమ్‌లో ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రముఖ హిందూ మత బోధకుడు జయ్‌కాంత్ మిశ్రా, ఇద్దరు మహంత్‌లు మిథిలేష్ నందిని శరన్, సత్యనారాయణ దాస్‌లతో కూడిన కమిటీ ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నది. 200 మందిలో ఎంపిక చేయబోయే 20 మంది పూజారులకు ఆరు నెలల పాటు ప్రత్యేకమైన శిక్షణ ఉండనుంది.ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు..?త్వరలోనే నిర్వహించబోయే ఈ ఇంటర్వ్యూకు ఎంపిక కాబోయే 20 మంది అభ్యర్థలకు సంద్యా వందనం అంటే ఏమిటి..? రాముడిని పూజించేందుకు ఏ మంత్రాలను వాడతారు..? కర్మకాండలకు సంబంధించిన ప్రశ్నలు అడుగనున్నట్టు ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ దేవ్ గిరి తెలిపారు. ఇంటర్వ్యూలో నెగ్గిన వారికి ఆరు నెలల కాలంలో రూ. 2వేల స్టైఫండ్‌తో పాటు ఇతర వసతులు కల్పిస్తామని వివరించారు. ఇక షార్ట్‌లిస్ట్ చేసిన 200 మంది అభ్యర్థులలో ఇంటర్వ్యూకు రానివారు నిరాశ చెందాల్సిన పన్లేదు. వారికి భవిష్యత్‌లో మళ్లీ అవకావం దక్కొచ్చని ట్రస్ట్ తెలిపింది.
* కాంగ్రెస్ గెలిస్తే భట్టి విక్రమార్క సీఎం
మదిరలో భట్టి విక్రమార్క గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. మంగళవారం మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్.. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మధిర నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. నాకు ఎవరు దరఖాస్తు చేయకున్నా, భట్టి విక్రమార్క నన్ను అడగకున్నా దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ కోసం చింతకాని మండలాన్ని నేనే ఎంపిక చేశానన్నారు. భట్టి విక్రమార్క నేనే సీఎం అవుతానని కొత్త డ్రామాకు తెరలేపాలని బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే లాభం జరుగుతుంది తప్ప భట్టి విక్రమార్కతో వచ్చేది లేదు పోయేది లేదన్నారు. పట్టింపు లేని భట్టి విక్రమార్కకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.భట్టి విక్రమార్క మధిరకు ఆరు నెలలకు ఓ సారి చుట్టపు చూపుగా వచ్చిపోతుంటారని అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే నష్టమే అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళితబంధు వంటి కార్యక్రం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వైన్స్ షాపులు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, ప్రభుత్వ పనుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. పట్టింపు లేని భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే మనకు వచ్చేదేందని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో డజన్ మంది సీఎంలు ఉన్నారని వారంతే గెలిచేది లేదన్నారు. కాంగ్రెస్ చెబుతున్నదంతా డంబాచారమే అని విమర్శించారు. ఒక్క దళితుడు కూడా భట్టి విక్రమార్కకు ఓటు వేయవద్దన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరెంటు రాదు, నీళ్లు రావన్నారు.మమ్మల్ని రెండు సార్లు ఓడించినా ఇక్కడి ప్రజలపై మేము అలగలేదు. వివక్ష చూపలేదన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అని ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టి బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బందుల పాలు చేసిందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో మధిరలో కరెంటు ఉండేదా? అని ప్రశ్నించారు. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు, తాము అధికారంలోకి వస్తే ధరణి తీసేసి భూమాత అమలు చేస్తామని భట్టి విక్రమార్క అంటున్నారు. అది భూమాతన భూమేతనా అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రం గురించి అవగాహనే లేదని విమర్శించారు. సీతారామసాగర్ పూర్తయితే మధిర నియోజకవర్గం వైపు కరువు తిరిగి చూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వకుండా బీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేసిందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో పండగల పంటలు పండుతున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఈ విషయం మనకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వమే చెప్పిన లెక్కలన్నారు. చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ కోసం కృషి చేస్తున్నాం. మీ ఓటు మీ భవిష్యత్ తో పాటు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్నారు. అందువల్ల ఎన్నికల్లో సరైన అభ్యర్థికే మీ ఓటు వేయాలని కోరారు.
* ఇంద్రకీలాద్రి పై ఇంగ్లండ్ క్రికెటర్లు
ఇంగ్లాండ్ అండర్ 19 క్రికెట్ టీం విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో నవంబర్ 27 వరకు అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న అండర్ 19 ఇంగ్లండ్ క్రికెట్ బృదంలోని 19 మంది సభ్యులు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంగ్లండ్ క్రీడాకారులకు ఆలయ పాలకమండలి, ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డ్ సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణి, సహాయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.
* రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్
తెలంగాణలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. బహిరంగ సభలు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లతో వీధులు, గ్రౌండ్లు దద్దరిళ్లుతున్నాయి. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు నుంచి నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పరకాలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా సభకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయగా రేవంత్ రెడ్డి వారిని మైక్ చూయిస్తూ ఎంకరేజ్ చేశారు. నినాదాలు చేయండంటూ చేత్తో సిగ్నల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
👉 – Please join our whatsapp channel here –