Sports

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్ హవా

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్ హవా

చైనాలోని షెన్‌జెన్‌ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రోజు భారత్‌కు ఆశించిన ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో ఇండియా స్టార్‌ షట్లర్‌ హెచ్ఎస్‌ ప్రణయ్‌తో పాటు డబుల్స్‌ జోడీ చిరాగ్‌ శెట్టి – సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డిలు రెండో రౌండ్‌కు చేరారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ పోటీలలో వీళ్లు విజయాలు సాధించి ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌.. 21-18, 22-20 తేడాతో చైనీస్‌ తైఫీకి చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ చౌ టీన్‌ చెన్‌ను ఓడించాడు. 50 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆరంభంలో తడబడ్డా తర్వాత పుంజుకున్నాడు. ఆట ఆరంభంలో 6-9 తో వెనుకబడ్డ ప్రణయ్‌.. బ్రేక్‌ సమయానికి పుంజుకున్నాడు. రెండో గేమ్‌లో ఇరువురూ హోరాహోరి తలపడ్డా చివరికి ప్రణయ్‌నే విజయం వరించింది. వారం రోజుల క్రితం చౌ టీన్‌.. జపాన్‌ మాస్టర్స్‌లో ప్రణయ్‌ను ఓడించాడు.