Politics

16వేలు రైతుబంధు ఇస్తాం!

16వేలు రైతుబంధు ఇస్తాం!

ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని.. అది భూ‘మేతే’ అవుతుందని ఎద్దేవా చేశారు. తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్‌ రోహిత్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.

‘‘రూ.200 ఉన్న పింఛను రూ.2వేలు చేశాం. రైతుల బాగోగుల కోసం రైతుబంధు ప్రవేశపెట్టాం. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తాం. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా డబ్బులు ఎలా వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు వస్తోంది. పొరుగున ఉన్న కర్ణాటకలో ఐదు గంటలే కరెంటు ఇస్తున్నారు. కరవు, వలసలతో గత కాంగ్రెస్‌ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు నేడు తెలంగాణలో లేవు. నీటిపన్ను రద్దు చేశాం. రైతుబంధు సొమ్ము దుబారా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దు.

భాజపా నాయకులు వచ్చి మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని వస్తే పైలట్ రోహిత్‌రెడ్డి పట్టించారు. అందుకే ఆయన ఏ పనులు అడిగినా వెంటనే నిధులు మంజూరు చేశాను. 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారు. దాని వల్ల తాండూరు పరిధిలోని ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ నిర్మించాం. భారాసకు మద్దతు తెలిపిన సేవాలాల్‌ సంఘానికి నా కృతజ్ఞతలు’’ అని కేసీఆర్‌ వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z