* టీమిండియా మాజీ క్రికెటర్ పై చీటింగ్ కేసు నమోదు
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్(Sreesanth)పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై ఆ కేసు బుక్కైంది. కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన సారీశ్ గోపాలన్ అనే వ్యక్తి ఆ కేసును ఫైల్ చేశాడు. చూండాకు చెందిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఏప్రిల్ 25, 2019 నుంచి రాజీవ్ కుమార్, వెంకటేశ్ కిని అనే ఇద్దరు వ్యక్తులు తన వద్ద సుమారు 18.70 లక్షలు తీసుకున్నారని, కర్నాటకలోని కొల్లూరులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు వాళ్లు చెప్పారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. అయితే ఆ అకాడమీలో శ్రీశాంత్ పార్ట్నర్గా ఉన్నాడు. అకాడమీలో భాగస్వామ్యం ఇస్తారని చెప్పడం వల్లే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు ఫిర్యాదుదారుడు తెలిపాడు. ఐపీసీ 420 సెక్షన్ కింద శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు బుక్ చేశారు. ఆ కేసులో శ్రీశాంత్‌ను మూడవ నిందితుడిగా చేర్చారు.
* డబ్బు కోసం ఓ బాలుడు దారుణ హత్య
దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకొంది. కేవలం రూ.350 కోసం ఓ బాలుడు ఒక యువకుడిని హత్య చేశాడు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర దిల్లీలో వెల్కమ్ ప్రాంతంలో ఒక బాలుడు దారిన వెళుతున్న యువకుడిపై దాడికి దిగాడు. బాధితుడిపై దాడి చేసి ఊపిరాడనీయలేదు. అతడు స్పృహ కోల్పోయిన తర్వాత తన వద్ద ఉన్న కత్తితో దాదాపు 60 సార్లు పొడిచాడు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.350 నగదు తీసుకొన్నాడు. కొద్దిసేపు మృతదేహం ఎదుట డాన్స్ చేస్తూ.. పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ దారుణమంతా సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. మరణించిన వ్యక్తితో నిందితుడికి గతంలో ఎలాంటి పరిచయం లేదని తేలింది. కేవలం డబ్బు కోసమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
* గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల నగదును సీజ్
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ అక్రమంగా తరలిస్తున్న కోట్లాది రూపాయల డబ్బులు పట్టుబడుతున్నాయి. గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల నగదును సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ రోడ్ నుండి చిరెక్ పబ్లిక్ స్కూల్ పైపు కారు లో డి.సంతోష్, నరేష్, సంపత్ అనే ముగ్గురు వ్యక్తులు నగదును తరలిస్తున్న క్రమంలో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా కారులో రెండు సంచుల్లో ఐదు కోట్ల రూపాయల నగదును గుర్తించారు. పట్టు పడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తించారు. పట్టుబడ్డ నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
* ప్రియుడితో పెళ్లి చేయాలంటూ సెల్ టవర్ ఎక్కిన మహిళ
తన ప్రియుడితో పెళ్లి చేయాలంటూ ఒక మహిళ సెల్ టవర్ పైకి ఎక్కింది. (Woman Climbs Mobile Tower) పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు తనను మోసగించాడని ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. నచ్చజెప్పి ఆ మహిళను టవర్ పైనుంచి కిందకు దించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం భితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్రా రాజా టోల్ ప్లాజా సమీపంలో ఉన్న మొబైల్ సెల్ టవర్ పైకి ఒక మహిళ ఎక్కింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు తనను మోసగించాడని ఆరోపించింది. కాగా, ఇది చూసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సెల్ టవర్ పైకి ఎక్కిన మహిళకు నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. ఆమెను మోసగించిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతడి కోసం వెతుకుతున్నారు. ప్రియుడి తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
* గురుద్వారా వద్ద కాల్పులు
కపుర్తలా గురుద్వారా నియంత్రణపై నిహాంగ్స్ కాల్పులు జరపడంతో పంజాబ్ పోలీసు మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఘటన పంజాబ్ లోని కపుర్తలా జిల్లాలోని సుల్తాన్పూర్ లోధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ అకల్ బుంగా సాహిబ్‌ను నియంత్రించేందుకు పోటీపడుతున్న రెండు నిహాంగ్ వర్గాల మధ్య గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. ఇరువర్గాల కాల్పుల్లో పంజాబ్ పోలీసు కానిస్టేబుల్ మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. కాల్పుల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు గురువారం తెలిపారు.ఈ ఘటనలో కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారని, మరికొందరికి ‘కిర్పాన్’ (కత్తి) గాయాలయ్యాయని సుల్తాన్పూర్ లోధి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లఖ్వీందర్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులు సుల్తాన్పూర్ లోధి సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎస్హెచ్ఓ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఘర్షణలు జరగకుండా గురుద్వారా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గురుద్వారా స్వాధీనంపై వివాదం కొనసాగుతోందని, పోలీసులు, సివిల్ అడ్మినిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని కపుర్తాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వత్సల గుప్తా తెలిపారు.
* ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లితండ్రులతో పాటు సోదరుడు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేయడంతో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వలిగొండ మండలం వేములకొండకు చెందిన యాట నవీన్ అదే గ్రామానికి చెందిన ఎలగందుల మానస ప్రేమించుకుని 15 మాసాల క్రితం ఇళ్ల నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు.హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నవీన్ బుధవారం వలిగొండ మధిర గ్రామం మల్లేపల్లికి వచ్చాడు. దహనసంస్కారాలు పూర్తయిన తర్వాత నవీన్ స్వగ్రామం వేములకొండకు వచ్చాడు. సాయంత్రం ఇంటి సమీపంలోని వాటర్ ఫిల్టర్ వద్ద మిత్రులతో కలిసి మాట్లాడుతున్నాడు.విషయం తెలుసుకున్న మానస తల్లిదండ్రులు మార్కండేయ, సరస్వతి, సోదరుడు మత్స్యగిరి ముగ్గురు కలిసి కత్తితో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నవీన్‌ను పట్టుకోగా ఒకరు కత్తితో అతడి శరీరంపై ఇష్టానుసారంగా పొడిచారు. ఒకరి తర్వాత మరొకరు నవీన్ శరీర భాగాలపై దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న నవీన్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు తొలుత వలిగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం నవీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.
* ముంబైలో భారీ అగ్ని ప్రమాదం
ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ముంబై లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ముంబైలోని 24 అంతస్తుల నివాస భవనంలో గురువారం మంటలు చెలరేగాయి, కనీసం 135 మందిని అక్కడి నుండి సురక్షితంగా రక్షించినట్లు పౌర అధికారులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. ఘోడాప్డియో ప్రాంతంలోని MHADA కాలనీలోని న్యూ హింద్ మిల్ కాంపౌండ్‌లో ఉన్న భవనం యొక్క మూడవ అంతస్తులో తెల్లవారుజామున 3:40 గంటలకు మంటలు చెలరేగాయని, ఇక్కడ ప్రభుత్వం ప్రజలకు, ప్రధానంగా మిల్లు కార్మికులకు ఫ్లాట్లను ఇచ్చిందని వారు తెలిపారు. ఎలక్ట్రిక్ మీటర్ క్యాబిన్, వైరింగ్, కేబుల్, ఎలక్ట్రిక్ డక్ట్లోని స్క్రాప్ మెటీరియల్, భవనంలోని 1వ అంతస్తు నుంచి 24వ అంతస్తు వరకు ఉన్న చెత్తకుండీలోని చెత్త, మెటీరియల్‌కు మాత్రమే మంటలు అంటుకున్నాయని పౌర అధికారి ఒకరు తెలిపారు.భవనంలోని వివిధ అంతస్తుల నుంచి కనీసం 135 మందిని సురక్షితంగా రక్షించినట్లు ఆయన తెలిపారు. వీరిలో 25 మందిని టెర్రస్ నుంచి, 30 మందిని 15వ అంతస్తులోని ఆశ్రయం నుంచి, 80 మందిని భవనంలోని 22వ అంతస్తులోని ఆశ్రయం నుంచి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న వెంటనే ఐదు ఫైర్ ఇంజన్లు మరియు మూడు వాటర్ ట్యాంకర్లతో పాటు ఇతర అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.. దాదాపు నాలుగు గంటలు కష్టపడి ఉదయం 7:20 గంటలకు మంటలను ఆర్పివేశారని అగ్నిమాపక దళ అధికారి తెలిపారు.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇది సంభవించి ఉంటుందని పౌర అధికారి తెలిపారు.. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
* పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు స్వాధీనం
జమ్మూలో ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు మరోసారి భగ్నం చేశాయి. జమ్మూలోని అఖ్నూర్‌లోని పలన్వాలాలో నియంత్రణ రేఖకు దగ్గరలో గురువారం ఆర్మీ, జమ్మూ పోలీసుల సంయుక్త బృందం ఆయుధాల క్వాష్‌ను స్వాధీనం చేసుకున్నది. పలన్వాలా సమీపంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌లో అనుమానాస్పద బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాక్స్‌ను తెరిచి చూడగా.. ఆయుధాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు.సరిహద్దుల ఆవల తిష్ట వేసిన ఉగ్రవాదులు డ్రోన్లను ఉపయోగించి ఈ ఆయుధాలను సరిహద్దులు దాటించారని పేర్కొన్నారు. ఆయుధాలు స్మగ్లర్లు, ఉగ్రవాదులకు అందక ముందే వాటిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నది. బాక్సులో బ్యాటరీ అమర్చిన ఐఈడీ, ఒక పిస్టల్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, 38 బుల్లెట్లు, 9 హ్యాండ్ గ్రెనేడ్లు లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఖౌడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయుధాల బాక్స్ దొరికిన పరిసరాల్లోనూ పోలీసులు సోదాలు చేపట్టారు. పలన్వాలా ప్రాంతానికి ఆనుకుని ఉన్న మార్గాల్లో నిఘాను పెంచారు.
👉 – Please join our whatsapp channel here –