షెన్‌హెన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టిలు ఫైనల్‌లో తడబడ్డారు. తుదిపోరుదాకా ధాటిగా ఆడిన సాత్విక్-చిరాగ్ ద్వయం.. 19-21, 21-18, 19-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ జోడీ లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. గంటా 11 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో భారత షట్లర్లు పోరాడి ఓడారు. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలలో లియాంగ్-వాంగ్ పై గెలిచినా చైనా మాస్టర్స్‌లో మాత్రం ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌లో సాత్విక్ – చిరాగ్‌లకు గత ఆరు ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి.
తొలి రౌండ్‌లో హోరాహోరి పోరాడినా రెండు పాయింట్ల తేడాతో గేమ్ కోల్పోయిన భారత జోడీ.. రెండో గేమ్ గెలుచుకుంది. మూడో సెట్‌లో పోరాడినా చైనా ద్వయాన్నే విజయం వరించింది. కాగా ఎనిమిదేండ్ల తర్వాత చైనాకు పురుషుల డబుల్స్‌లో ఇదే తొలి విజయం కావడం గమనార్హం. భారత షట్లర్లు ఈ సీజన్‌లో వరుసగా బ్యాడ్మింటన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్, ఇండోనేషియా సూపర్ 1000, కొరియా సూపర్ 500, స్విస్ సూపర్ 300 ఫైనల్ విజయాలతో పాటు ఆసియా క్రీడలలో స్వర్ణం గెలుచుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –