ఏ పంట వేసినా వాటి పువ్వులో కాయలో రైతుకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. అవేమీ లేకపోయినా.. వేసిన మూడు నెలలకే కాసులు కురిపిస్తుంది జెరేనియం. రైతుల పాలిట కల్పవృక్షమైన దీని ఆకులూ, కాండం నుంచి వచ్చే నూనె ధర మార్కెట్లో పన్నెండు వేల నుంచి ఇరవై వేల దాకా పలుకుతోంది. విదేశాల్లోనే సాగయ్యే ఈ పరిమళ పంట ఇప్పుడు మన దగ్గర కూడా పండుతోంది.
లావెండర్, రోజ్, రోజ్మేరీ, చామంతి, పెప్పర్మింట్ వంటి రకరకాల ఎసెన్షియల్ నూనెలు మనకు తెలిసినవే. మొక్కల నుంచి తీసే పరిమళ నూనె జెరేనియం కూడా అలాంటిదే. ఇండోనేషియా, ఈజిప్టు, చైనాల్లో విరివిగా సాగయ్యే ఈ నూనెను ఔషధాలూ, సౌందర్యోత్పత్తులూ, పెర్ఫ్యూమ్ల తయారీలోనూ, స్పాల్లోనూ ఉపయోగిస్తారు. మన దేశంలోని చాలా ఫార్మా, కాస్మెటిక్స్ సంస్థలు ఈ సుగంధాల నూనెను ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. పలు రంగాల్లో డిమాండ్ ఉండటంతో దీని ధర లీటరు పన్నెండు వేల నుంచి ఇరవై వేల దాకా పలుకుతోంది. అందుకే ఈ సాగు పట్ల రైతులు ఆకర్షితులవుతున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో- జహీరాబాద్ వంటి చోట్ల ఇప్పటికే సాగు చేస్తున్నారు.
కోతకోతకూ అధికాదాయం
జెరేనియం పంట వేసిన మూడు నెలలకు గుబురుగా పెరుగుతుంది. కొమ్మలన్నీ వేరు చేసి బాయిలర్లలో వేసి ఆవిరి మీద ఉడికించి నూనె తీస్తారు. దాదాపు టన్ను మొక్కల నుంచి లీటరు నూనె వస్తుంది. ఎకరానికి సుమారు పదహారు లీటర్ల నూనెను ఉత్పత్తి చేయొచ్చు. ఏడాదికి నాలుగు సార్లు పంటను కోసి నూనెను సేకరిస్తారు. ఈ నూనెను వెంటనే అమ్మలేకపోయినా నిల్వ చేసుకుంటే రెండేళ్ల వరకూ సువాసనలు తాజాగానే ఉంటాయి. చాలామంది రైతులు సంఘాలుగా ఏర్పడి ఈ తరహా పంటల్ని పండిస్తున్నారు. వీటితోపాటు నూనె తీసే యంత్రాల్ని కూడా ఏర్పాటు చేసుకుని ఫార్మా, కాస్మెటిక్స్ సంస్థలకు లాభాలకు విక్రయిస్తున్నారు. మరికొందరైతే నూనె తీసుకునే విధంగా పలు సంస్థలతో ముందే ఒప్పందం చేసుకుని అప్పుడు సాగు చేస్తున్నారు.
కోతకోతకీ దిగుబడి పెరగడం జెరేనియం ప్రత్యేకత. కరవు ప్రాంతాల్లో సైతం సాగు చేయగలిగిన ఈ పంటకు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం ఎంతో అనుకూలం. నెలకి రెండు సార్లు నీళ్లు పెట్టినా సరిపోతుంది. చీడల బెడద కూడా తక్కువే. మెడిసినల్ ప్లాంట్ కాబట్టి రసాయనాల జోలికి పోకుండా సేంద్రియ ఎరువుల్నే వాడుతుంటారు రైతులు. మరి సాగు చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఈ మొక్కల్ని తెచ్చి నాటడం ఎలా అనుకుంటున్నారా! లఖ్నవూలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీఎస్ఐఆర్- సీఐఎమ్ఏపీని సంప్రదిస్తే ఈ మొక్కలను ‘అరోమా మిషన్’లో భాగంగా అందిస్తారు. రైతుల్ని ప్రోత్సహించాలని సాగు విధానంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక సాగులోకి దిగినవారేమో ఈ మొక్కల పక్కన పాదులో వచ్చే కొత్తవాటితో నర్సరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఎన్నో రకాలుగా రైతులకు సిరులు కురిపిస్తున్న జెరేనియం నూనెతో ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. గులాబీ పరిమళాన్ని పోలిన సువాసనను వెదజల్లే జెరేనియం ఒత్తిడినీ, యాంగ్జైటీనీ దూరం చేస్తుంది. అందుకే అరోమా థెరపీలో మర్దనలకు ఈ నూనెనే ఎంచుకుంటారు. ఇంకా కళ్ల కింద మచ్చల్నీ, మొటిమల్నీ తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేయడంతోపాటు ఎన్నో రకాల సమస్యల్ని దూరంగా ఉంచుతుంది. ఇంకా మరెన్నో సుగుణాలున్న ఈ జెరేనియం దోమల్ని తరిమేసి, కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అందుకే దీన్ని ఇండోర్ ప్లాంట్గానూ ఎంచుకుంటున్నారు చాలామంది. తక్కువ పెట్టుబడితో పెద్దగా శ్రమ లేకుండా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే జెరేనియం… రైతులకు నిజంగా ప్రకృతి వరప్రసాదమే!
👉 – Please join our whatsapp channel here –