Agriculture

రైతుబంధుకు బ్రేక్

రైతుబంధుకు బ్రేక్

తెలంగాణ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని… లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే ఈసీ షరతు విధించింది. అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది.

యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతించింది. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు అయిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

రాష్ట్రంలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ ఆరంభానికి ముందు నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. ఈసారి శాసనసభ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని.. యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. పరిశీలించిన ఈసీ మూడు రోజుల క్రితం నిధుల జమకు అనుమతి మంజూరు చేసింది. తాజాగా ఆ అనుమతిని ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈసీ అనుమతి నిరాకరణతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ సాయం నిలిచిపోనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z