బందరు నియోజకవర్గంలో ఇంటి నంబరు 14/196లో ఏకంగా 97 ఓట్లు నమోదవడం కలకలం రేగుతోంది. దాదాపు ఇదే తరహాలో కొన్ని వందల ఓట్లు నమోదయ్యాయి. వీటిలో కొన్ని వేల ఓట్లు బోగస్‌వని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా ఆయా లోపాలను సవరించలేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా లోపాలు మచిలీపట్నం నగరంలోనే అనేకం వెలుగు చూస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా.. జిల్లా యంత్రాంగం పెడచెవిన పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా నియోజకవర్గ ఓటర్ల జాబితా లోపాలపుట్టగా మారింది. కొత్తగా ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులకు 6, 7, 8 ఫారాలు అందినా, వాటినీ పరిష్కరించకుండా వదిలేశారు. ఈ పరిస్థితులపై దిలీప్‌కుమార్ హైకోర్టులో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర సైతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు.
ఇదెలా సాధ్యం!
ఒకే ఇంటిలో వందల మందికి ఓట్లు ఉండటం ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు. ఈ తరహా మచిలీపట్నం నగరపాలక సంస్థ రెండు, మూడు డివిజన్లలో ఇటీవల దాదాపు 980 ఓట్లను గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.
ఇంటి నంబరు 14/196లో 97 ఓట్లు ఉండగా, వాటిని 88, 87, 89, 136 పోలింగ్ బూత్‌లకు సర్దుబాటు చేయడం గమనార్హం.
మరో ఇంటి నంబరు 14/196/1లో 20 ఓట్లు నమోదవ్వగా, వాటిని మూడు పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేశారు. వీటిలో స్థానికంగా లేని వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలిసింది.
డోరు నంబరు 14/196/10లో 14 ఓట్లు, 14-196/25లో 26 ఓట్లు నమోదు చేశారు. వీరిలో అపరిచితులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఇళ్లన్నీ రెండుమూడు పోర్షన్లున్న పెంకుటిళ్లు, చిన్న డాబాలు మాత్రమే. వాటిలో ఇంతమంది ఎలా నివాసం ఉంటున్నారనేది తేలాల్సి ఉంది. ఇలా మచిలీపట్నంలో 87, 88, 89 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇష్టానుసారం పేర్లను చేర్చారు.
9-306 నంబరు గల ఇంటిలో 22 మంది, 15-456లో 30, 9-98 ఇంటిలో 20, 9-528 ఇంటిలో 14 మంది ఓటర్లను నమోదు చేశారు.
14-196-25 గృహంలో మొత్తం 56 ఓట్లు నమోదయ్యాయి. వీటిపై అభ్యంతరాలు లేవనెత్తినా సవరించకపోవడం విశేషం.
రూల్ నంబరు 6 ఏదీ..?
ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రూల్ నంబరు 6 ప్రకారం జాబితాలో ఇంటి నంబర్లన్నీ వరుస క్రమంలో ఉండాలి. కానీ బందరు నియోజకవర్గంలో ఇష్టానుసారం నమోదు చేశారు. ఒకే ఇంటిలో ఉన్న ఓటర్లను సైతం పలు పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేశారు. ఉదాహరణకు 14/196-8-1 ఇంటి నంబరులో 13 ఓట్లు నమోదు చేశారు. వీటిలో యర్రబాటి పద్మావతి 85వ నంబరు పోలింగ్ బూత్‌లో ఉంటే యర్రబాటి సీతారామ్ ఓటు 88వ బూత్‌లో చేర్చారు. మరో 9 ఓట్లు 87వ బూత్‌లో ఉన్నాయి. 89 పోలింగ్ కేంద్రంలో మూడు ఓట్లు చేర్చారు. ఇలాంటి చిత్రాలు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ్య సున్నా ఇంటి నంబరుతో ఓట్లు ఉండే అవకాశం లేదు. కానీ ఈ నియోజకవర్గంలో దాదాపు 1,500 పైగా అలా కనిపిస్తున్నాయి.
మరణాలు ఇతర ప్రాంతాలకు..
బందరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో మరణాలను తొలగించలేదు. ఒక డివిజనులోని మరణాలను మరో డివిజనుకు మారుస్తున్నట్లు తెలిసింది. కొత్తగా ఓటర్ల నమోదు కోసం 8,462, తొలగింపుల కోసం 14,597 దరఖాస్తులు అందాయి. వీటిలో చాలా వరకు మరణాలు ఉన్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీకి 16,884 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో ఎక్కువ శాతం మృతి చెందిన వారి ఓట్లున్నట్లు ఆరోపణలున్నాయి. కొంతమంది కావాలనే దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు. తెదేపా నేతలు ఫిర్యాదు చేసిన ప్రకారం 25 వేల ఓట్లు బోగస్‌వి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –