హామీలేని రుణాల విషయంలో నిబంధనలను ఆర్‌బీఐ కఠినతరం చేసిన విషయం తెలిసిందే. వీటి రిస్క్ వెయిట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో వ్యక్తిగత రుణాలు (Personal Loan) పొందడం కష్టంగా మారే అవకాశాలున్నాయి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కొనుగోళ్లను వాయిదాల్లోకి మార్చుకునే వెసులుబాటూ కష్టతరంగా మారొచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అత్యవసరంలో రుణం పొందడానికి అడ్డంకులు ఉండకపోవచ్చని సూచిస్తున్నారు.
సీయూఆర్ @ 30%
కఠిన నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇకపై రుణ మంజూరు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించనున్నాయి. నమ్మకమైన కస్టమర్లు, మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి మాత్రమే లోన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు (Credit Card) వాడే ప్రతి ఒక్కరూ తమ ‘క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR)’ 30 శాతం మించకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు సంస్థలు ఈ సీయూఆర్ 50% వరకు ఉన్నప్పటికీ.. ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చాయి. కానీ, ఇకపై అలా కుదరకపోవచ్చు. సీయూఆర్ ఎక్కువగా ఉందంటే మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థం. ఈ నేపథ్యంలో అలాంటి వారికి లోన్ ఇవ్వడానికి సంస్థలు ఆసక్తి చూపకపోవచ్చు.
డిపాజిట్లు ఉన్న బ్యాంకుకు..
ఇక మీదట వ్యక్తిగత రుణం లేదా ఇతర హామీలేని రుణాల కోసం మీ డిపాజిట్లు, ఇతర ఖాతాలు ఉన్న బ్యాంకుకే వెళ్తే ఉత్తమం. ఎందుకంటే రిస్క్ ప్రొఫైల్‌ను అంచనా వేసేటప్పుడు సుదీర్ఘంగా అనుబంధం ఉన్న కస్టమర్ల విషయంలో బ్యాంకులు కొంత వరకు ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉంది. పైగా వడ్డీరేటు, ఇతరత్రా రుసుముల విషయంలోనూ కొంత ప్రయోజనం ఉండొచ్చు. అయితే, రుణం పొందిన తర్వాత మాత్రం నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెల్లింపులు చేయాలి. ఫలితంగా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
క్రెడిట్ స్కోరు @ 750
ఎట్టిపరిస్థితుల్లో క్రెడిట్ స్కోర్ (Credit Score) 750 తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడే లోన్ పొందే అర్హత మెరుగ్గా ఉంటుంది. పైగా వడ్డీరేటు విషయంలోనూ రాయితీ లభించొచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ.. ఇతర కారణాలరీత్యా విముఖత వ్యక్తం చేస్తే.. పూచీకత్తు ఆప్షన్‌తో బ్యాంకులను ఆశ్రయించడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ లోన్ దరఖాస్తులు వద్దు..
స్వల్ప వ్యవధిలో వివిధ సంస్థల్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం సరికాదు. దీని వల్ల క్రెడిట్ స్కోర్ (Credit Score)పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకేసారి పలు లోన్లకు దరఖాస్తు చేసుకోవడం అంటే రుణాలపై అధికంగా ఆధారపడుతున్నారని అర్థం. ఇది మీ చెల్లింపు సామర్థ్యంపై బ్యాంకులకు సందేహాన్ని కలగజేస్తాయి. లోన్ పొందే అర్హతకు ఇది ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉంది.
ఫిన్‌టెక్ నిబంధనలపై కన్నేయాలి..
రుణాల మంజూరు విషయంలో ఇప్పటి వరకు ఫిన్‌టెక్ సంస్థలు దూకుడు ప్రదర్శిస్తూ వచ్చాయి. ఇకపై ఇవి కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. అయినప్పటికీ.. లోన్ ఇవ్వడానికి ఫిన్‌టెక్‌లు అంగీకరిస్తే నియమ నిబంధనలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రిస్క్ వెయిట్ పెరిగిన నేపథ్యంలో రుణదాతలకు రుణ మంజూరు భారంగా మారుతుంది. ఈ భారాన్ని రుణగ్రహీతలపై మోపేందుకు సంస్థలు వివిధ రకాల ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో వడ్డీరేట్లూ పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వడ్డీరేట్లు పెరగకపోయినా.. ఇతర రుసుములు, ఛార్జీల్లో పెరుగుదల ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రుణం పొందే ముందు నియమ నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించాలి.
నో-కాస్ట్ EMI, BNPLతో జాగ్రత్త..
నో-కాస్ట్ ఈఎంఐ, ‘ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి (BNPL)’.. వీటికి పెట్టుబడి అధికంగా కావాల్సి వస్తుంది. ఆర్‌బీఐ తాజా నిబంధనల నేపథ్యంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటిపై ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు ఛార్జీల వంటి వాటిని భారీగా పెంచే అవకాశం ఉంది. అందుకే వీటిని తీసుకునే ముందు ఛార్జీలను జాగ్రత్తగా పరిశీలించాలి.
👉 – Please join our whatsapp channel here –