టెక్ దిగ్గజం యాపిల్‌లో (Tim Cook) పనిచేయాలని కోరుకుని టెకీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏటా యాపిల్ కంపెనీలో అడుగుపెట్టాలని వేలాది మంది టెకీలు ప్రయత్నిస్తుండగా వీరిలో కొందరు తమ కలను సాకారం చేసుకుంటే ఎంతోమంది విఫలమవుతుంటారు. టెక్ దిగ్గజంలో అడుగుపెట్టాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను అడగ్గా ఆయన బదులిచ్చారు. టీమ్‌లో పనిచేయగలగడం, వినూత్న ఆలోచనలు, ఉత్సాహం, అంకిత భావం ఉన్న వ్యక్తుల పట్ల తాను మొగ్గుచూపుతానని టిమ్ కుక్ చెప్పుకొచ్చారు.
సింగర్, సాంగ్ రైటర్ దువా లిపా నిర్వహించిన ఈ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కుక్ పలు విషయాలు ప్రస్తావించారు. యాపిల్ ఉద్యోగుల్లో ఉమ్మడిగా గుర్తించగలిగిన అంశాలేంటని ప్రశ్నించగా మీలో ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలను బయటకు తీసుకువచ్చే వారితో పనిచేయడం అద్భుతమని చెప్పారు. మీ ఆలోచన నా ఆలోచన కలగలిపితే వ్యక్తుల తమ సొంత ఆలోచన కంటే మెరుగ్గా ఉంటాయని తాము నమ్ముతామని అన్నారు. అందుకే ఒకటి ప్లస్ ఒకటి మూడుతో సమానమని తాము విశ్వసిస్తామని కుక్ చెప్పుకొచ్చారు.
సహకారం అనేది ఉద్యోగులకు ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యమని అన్నారు. ప్రజల్లో సహకార ధోరణి ఎలా ఉందనేది కూడా తాను పరిశీలిస్తానని చెప్పారు. టెక్ దిగ్గజంలో పనిచేసేందుకు అభ్యర్ధులకు డిగ్రీ, మెరుగైన కోడింగ్ నైపుణ్యాలు అవసరమా అని ప్రశ్నించగా కాలేజ్ డిగ్రీ ఉన్న వారితో పాటు డిగ్రీ లేని వారు అన్ని వర్గాల ప్రజలను యాపిల్ హైర్ చేస్తుందని కుక్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ కోడింగ్ అత్యంత విలువైన నైపుణ్యమని తాను భావిస్తున్నా కోడింగ్ నైపుణ్యం లేని వ్యక్తులను కూడా యాపిల్ రిక్రూట్ చేసకుంటుందని తెలిపారు. యాపిల్ ఉద్యోగుల్లో నేర్చుకునే తపన, ప్రశ్నించేతత్వం కలిగిన ఔత్సాహికులను కోరుకుంటానని చెప్పారు. సృజనాత్మకత, టీం ప్లేయర్ల కోసం తాను చూస్తానని వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –