ఇది ఎన్నికల సమయం.. పదేళ్లుగా భారాస ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించుకోవాల్సిన సమయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘భారాస ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదు. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం అందుతోందా? మీ సమస్యలు ప్రభుత్వం వినట్లేదు. కనీసం మీ సమస్యలు వినటానికి కూడా ప్రభుత్వం దగ్గర సమయం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
తెలంగాణ కోసం యువకులు, విద్యార్థులు రక్తాన్ని చిందించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. భారాస నాయకులు ధనికులు అయ్యారు. మీ ప్రాణాలు అర్పించింది ఇందుకేనా? భారాస ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి ప్రజల కోసం ఏమీ చేయలేదు. వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వస్తే ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఇళ్లు కట్టుకోటానికి రుణాలు ఇస్తాం. మహిళలకు ప్రతీ నెల ₹2500 ఇస్తాం. తెలంగాణలో ఎక్కడికి ప్రయాణించాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఆరు గ్యారంటీలను ఇచ్చాం. తెలంగాణలో కూడా అమలు చేస్తాం. కాంగ్రెస్.. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తుంది’’ అని ప్రియాంక గాంధీ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –