NRI-NRT

స్టూడెంట్ వీసాల కోసం అమెరికా ఎంబసీ కొత్త నియమాలు

స్టూడెంట్ వీసాల కోసం అమెరికా ఎంబసీ కొత్త నియమాలు

అమెరికా (USA)లో చదువులకు వీసా (Visa) కోసం దరఖాస్తు చేసుకునే భారత విద్యార్థులకు ముఖ్య గమనిక. విద్యార్థి వీసాల (Student Visa) దరఖాస్తులకు యూఎస్‌ ఎంబసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మార్పులు సోమవారం (నవంబరు 27) నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్‌, ఎమ్‌, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ మార్పులను గుర్తుంచుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ వీసాలు అకడమిక్, ఒకేషనల్, ఎక్స్ఛేంజ్ స్టూడెంట్స్ కోసం జారీ చేస్తుంటారు. వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్‌మెంట్ సిస్టమ్‌ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు యూఎస్‌ ఎంబసీ తెలిపింది.

కొత్త నిబంధనలు ఇలా..

ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అధికారిక వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ క్రియేషన్‌, వీసా అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ చేసుకునేటప్పుడు సొంత పాస్‌పోర్ట్‌ సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్‌పోర్ట్‌ నంబరు ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా అప్లికేషన్‌ సెంటర్ల వద్ద తిరస్కరిస్తారు. అలాంటి వారి అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తారు. వారు వీసా ఫీజులను కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

తప్పుడు పాస్‌పోర్ట్‌ నంబరుతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్‌మెంట్‌ కోసం బుక్‌ చేసుకోవాలి. ఇందుకోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.

పాత పాస్‌పోర్టు పోవడం లేదా చోరీకి గురైతే కొత్త పాస్‌పోర్ట్‌ తీసుకున్నవారు, కొత్తగా పాస్‌పోర్టును రెన్యూ చేసుకున్నవారు.. పాత పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలి. అప్పుడే వారి అపాయింట్‌మెంట్‌ను ప్రాసెస్‌ చేసేందుకు అనుమతి లభిస్తుంది.

ఎఫ్‌, ఎమ్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ ధ్రువీకరించిన స్కూల్‌ లేదా ప్రోగ్రామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్‌ను పొందాలి.

స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న విద్యార్థులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. ఈ ఏడాది అమెరికా ఎంబసీ రికార్డు స్థాయిలో భారతీయుల వీసాలను ప్రాసెస్‌ చేసిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z