పెరుగుతున్న ఆన్‌లైన్ లావాదేవీల (Online transactions) మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్థాయి మొత్తానికి మించి జరిగే తొలి లావాదేవీని నిర్దిష్ట సమయం పాటు నిలిపి ఉంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే ఆ సమయంలో ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు కీలక ప్రభుత్వ అధికారులు వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కథనంలో పేర్కొంది.
ఈ కొత్త విధానం వల్ల డిజిటల్ లావాదేవీ (Digital Payments)ల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ.. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ చర్య తప్పదనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల వ్యవధి తర్వాతే ట్రాన్సాక్షన్‌ను ప్రాసెస్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, రిటైల్ లావాదేవీల్లో ఇబ్బంది లేకుండా రూ.2,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లింపులకు మాత్రమే నాలుగు గంటల వ్యవధి నిబంధనను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది.
ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌తో పాటు యూపీఐ చెల్లింపుల (UPI transfers)కు కూడా ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్‌లకు ఈ నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కొత్తగా యూపీఐ ఖాతా తెరిచినప్పుడు తొలి 24 గంటల్లో కేవలం రూ.5,000 చెల్లింపునకు మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే నెఫ్ట్‌లో తొలి 24 గంటల్లో రూ.50,000 మాత్రమే పంపగలం.
కానీ, తాజాగా ప్రభుత్వ యోచనలో ఉన్న ప్రణాళిక ప్రకారం గత చరిత్రతో సంబంధం లేకుండా.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తొలి లావాదేవీలన్నింటికీ (రూ.2,000 దాటితే మాత్రమే) నాలుగు గంటల వ్యవధి నిబంధనను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నిబంధనపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని అధికారులు తెలిపారు. కానీ, ఇటీవల యూకో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో పొరపాటున రూ.820 కోట్లు జమ అయిన ఉదంతంతో ప్రభుత్వం అప్రమత్తమయినట్లు పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –