నీటి మడుగులోశయనించే ఆ స్వామి… నలభయ్యేళ్ళకోసారి పైకి వస్తాడు. భక్త జన కోటికి కనువిందు చేస్తాడు. అత్తి కర్రతో మలచిన ఆర్త రక్షకుడు ఈ కంచి వరదుడు!మత్స్యావతారం ఎత్తి, జలాలలో దాగిన సోమకుణ్ణి వధించి, వేదాలను కాపాడిన శ్రీమహావిష్ణువు… సప్త మోక్షపురాలలో ఒకటైన తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామిగా నీటి కొలనులో విశ్రమిస్తాడు. నాలుగు దశాబ్దాలకు ఒకసారి పైకి వస్తాడు. వివిధ అలంకారాల్లో అర్చనలు అందుకుంటాడు. మళ్ళీ జలగర్భంలోకి చేరుకుంటాడు. ఏ ఆలయంలోనూ కనిపించని ఈ విశేషానికి కంచిలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఇప్పుడు మరోసారి వేదిక అయింది.
**బ్రహ్మ కొలిచిన పాదం..
అ శ్రీవరదరాజ స్వామి (అత్తి వరదర్) జల నివాసం వెనుక అనేక కథనాలు ఉన్నాయి. స్థలపురాణం ప్రకారం, బ్రహ్మ దేవుడు దేవలోక శిల్పి విశ్వకర్మను పిలిచి, తాను నిర్వహించబోయే మహాయాగానికి అనువైన నగరాన్ని నిర్మించాలని కోరాడు. బ్రహ్మ కోరిక మేరకు విశ్వకర్మ చెక్కిన మహా అద్భుతమే నేటి కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం. బ్రహ్మతో విబేధాల కారణంగా తాను ఆ యాగంలో పాల్గొనడం లేదని సరస్వతి చెప్పడంతో గాయత్రి, సావిత్రిలతో బ్రహ్మ యాగాన్ని పూర్తి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతి ఆవేశం చెంది ‘వేగవతి’ నదిగా పొంగి పొరిలి, యాగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో యాగాన్ని కాపాడేలా మహావిష్ణు ఆ నదికి అడ్డుగా పడుకొని ప్రళయాన్ని అడ్డుకున్నాడు. బ్రహ్మ చేపట్టిన అశ్వమేధ యాగం దిగ్విజయంగా పూర్తయింది. యాగ గుండంలోని అగ్ని నుంచి లక్ష్మీదేవి సమేతంగా మహావిష్ణువు వరదరాజ పెరుమాళ్గా ఆవిర్భవించాడు.ఆయనే అత్తివరదర్గా పూజలందుకుంటున్నాడు. యజ్ఞగుండం నుంచి బయటకు వచ్చిన అత్తివరదర్ అగ్నిలో దహించిపోవడంతో ఆ విగ్రహాన్ని మూలవర్ సన్నిధిలో ప్రతిష్ఠించరాదని నిర్ణయించారట! అగ్ని నుంచి బయటకు వచ్చిన సమయంలో అధిక వేడిమితో తల్లడిల్లిపోయిన స్వామివారిని చల్లబరిచేందుకే 40 ఏళ్లు నీటిలోనే ఉంచుతున్నట్టు స్థలపురాణం సూచిస్తోంది. కాగా, 1688వ సంవత్సరం ఔరంగజేబు కాలంలో అత్తి వరదర్ విగ్రహాన్ని కాపాడుకొనేందుకు కాంచీపురం నుంచి తిరుచ్చి సమీపంలోని ఉడయార్పాళయానికి తరలించి దాచిపెట్టారనీ, ఆ తరువాత మళ్లీ ఆ విగ్రహాన్ని కాంచీపురం తరలించారనీ తెలుస్తోంది. దీన్ని బట్టి చాలా ఏళ్ళు వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని మూలవర్ సన్నిధిలో అత్తి వరదర్ లేరన్న విషయం స్పష్టమవుతోంది.
*ఆదిశేషుడి అనుమతితో…
మరో కథనం ప్రకారం… అత్తి వరదరాజ స్వామిని కృతయుగంలో విశ్వకర్మ అత్తి చెట్టుతో చేశాడు. దాన్ని బ్రహ్మ స్వయంగా ప్రతిష్ఠించాడు. కాంచీపురంలో బ్రహ్మ యాగం చేస్తున్నప్పుడు స్వామివారి దారు విగ్రహానికి మంటలు తాకాయి. ఆ అపరాధానికి పరిహారం ఏమిటని స్వామిని బ్రహ్మ అడిగితే, ఆదిశేషుడి మూర్తుల మధ్య కొలనులో తనను ఉంచాల్సిందిగా స్వామి ఆదేశించారు. అప్పటి నుంచి ఆలయం కొలనులో నీళ్ళలోనే స్వామి ఉన్నారు. ఆ మూర్తిని దర్శించే అవకాశం వివిధ యుగాల్లో కేవలం బ్రహ్మ, గజేంద్రుడు, బృహస్పతి, ఆదిశేషులకు మాత్రమే దక్కింది. మిగిలిన భక్తులకు కూడా తనను సేవించే అవకాశం ఇవ్వాలని స్వామి అడగడంతో, బ్రహ్మ, గజేంద్రుడు, బృహస్పతి కొన్ని క్షణాల సేపు మాత్రమే స్వామి దర్శన భాగ్యానికి అనుమతించారు. ఆదిశేషుడి వంతు వచ్చినప్పుడు, దేవతాకాలమానం ప్రకారం మండలం (40) రోజులకు ఒకసారి (మానవులకు 40 సంవత్సరాలు)… మానవ కాలమానంలో 48 రోజుల పాటు భక్తులు దర్శించుకోవడానికి అనుమతిని ఇచ్చాడు. తరువాత మళ్ళీ 40 ఏళ్ళు స్వామి నీటి మడుగులోనే ఉంటారు. దాన్ని ఆదిశేషుడి పేరిట ‘అనంత సరోవరం’ అని పిలుస్తారు.
*దాడులనుంచి రక్షణ కోసం…
కంచిపై ముస్లిం పాలకులు దాడులు చేసినప్పుడు, మూలవిరాట్టును కాపాడడం కోసం అర్చకులు దాన్ని రహస్యంగా దాచారన్నది మరో కథ. దాని ప్రకారం, సుమారు నలభయ్యేళ్ళ పాటు గర్భగుడిలో దేవతామూర్తులు, పూజా పునస్కారాలు లేవు. ఈలోగా మూలవిరాట్ను దాచిన అర్చకులు మరణించారు. వారి వారసులు దాని కోసం వెతికినా దొరకలేదు. చివరకు రాతితో చేసిన మరో విగ్రహాన్ని వేరే చోటు నుంచి తీసుకువచ్చి, గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ మూర్తిని ‘దేవరాజ స్వామి’ లేదా ‘శ్రీ వరదరాజ పెరుమాళ్’ అంటారు. ఆ తరువాత, కాంచీపురంలోని 1709లో స్వామివారి పుష్కరిణి ఎండిపోయినప్పుడు, అత్తి వరదర్ మూలవిరాట్ బయటపడింది. అర్చకులు, ఆలయ అధికారులు సమావేశమై, ఆలయ ఇతిహాసానికి అనుగుణంగా నలభయ్యేళ్ళకు ఒకసారి 48 రోజులపాటు అత్తి వరదర్కు పూజలు నిర్వహించాలనీ, భక్తులకు దర్శనం కల్పించాలనీ నిర్ణయించారు. అప్పటి నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం 108 వైష్ణవ దివ్య
క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ఉన్న కొండను అత్తిగిరి అంటారు.
*మళ్ళీ మరోసారి…
క్రితంసారి 1978లో అత్తి వరదర్ చివరి సారిగా దర్శనం ఇచ్చారు. తరువాత వెండి పెట్టెలో స్వామిని భద్రపరచి, తిరిగి అనంత పుష్కరిణిలో భద్రపరిచారు. నలభయ్యేళ్ళ తరువాత మళ్ళీ ఈ ఏడాది జూలై ఒకటో తేదీన అనంత సరోవరం నుంచి స్వామి పైకి వచ్చి, ఆలయంలోని వసంత మండపంలో విడిది చేశారు. నలభై ఎనిమిది రోజులపాటు భక్తులకు ఆయన దర్శనాన్ని అందిస్తారు. ఆ తరువాత స్వామి తదుపరి దర్శనం లభించేది 2059లోనే!
*కొన్ని రోజులు నిలబడి…
కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని ‘విష్ణు కంచి’ అంటారు. ప్రసిద్ధమైన బంగారు, వెండి బల్లులు ఉన్నది ఇక్కడే. ఈ బల్లులను తాకితే, బల్లి పడిన దోషాలు పోతాయంటారు.అత్తి వరదర్ విగ్రహం ఎత్తు సుమారు 10 అడుగులు.
ఈ 48 రోజుల్లో 30 రోజులు శయన భంగిమలో, 18 రోజులు నిలబడి స్వామి దర్శనం ఇస్తారు.ప్రతిరోజూ విశేష అలంకారం లేదా సేవ ఉంటాయి.48 రోజులు పూర్తి అయిన తరువాత అనంత సరోవరం (అనంత పుష్కరణి)లోని నాలుగు కాళ్ళ మండపంలో, వెండి పెట్టెలో స్వామిని భద్రపరుస్తారు.
**ఎప్పటి వరకూ?: ఆగస్టు 17 వరకూ
ఎక్కడ?: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఉన్న శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో
ఎలా వెళ్లాలి?: చెన్నై నుంచి 80 కి.మీ., తిరుపతి నుంచి 180 కి.మీ. దూరంలో కంచి ఉంది. ఆ నగరాల నుంచి బస్సుల్లో కంచి చేరుకోవచ్చు. నాగర్కోయిల్, మదురై వెళ్ళే కొన్ని రైళ్ళు కంచి రైల్వే స్టేషన్లో ఆగుతాయి. సమీప విమానాశ్రయం చెన్నైలో ఉంది.
ఇవీ చూడండి: కంచి కామాక్షి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి ఆలయం (శివకంచి), కామకోటి పీఠం.
అత్తి వరదర్ దర్శన సమయాలు: ఉదయం 4.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ
టిక్కెట్ బుకింగ్: https://tnhrce.gov.in వెబ్సైట్ ద్వారా అత్తి వరదర్ సహస్రార్చన టిక్కెట్లను 4 రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు. ఉదయం పది గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30కి జరిగే అర్చనకు 250, సాయంత్రం 5 గంటలకు నిర్వహించే అర్చనకు మరో 250 చొప్పున రోజుకు 500 టిక్కెట్లు విక్రయిస్తారు. శని, ఆదివారాలకు టిక్కెట్లు ఇవ్వరు. మిగిలిన రోజుల కోసం బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్టు ఖరీదు రూ. 500.
2. పూరీలో వైభవోపేతంగా బహుడా యాత్ర
విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో శుక్రవారం జగన్నాథ, బలభద్ర, సుభద్రల బహుడా(తిరుగు)యాత్ర వైభవంగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉదయం గుండిచా మందిర ప్రాంతం పురుషోత్తమ కీర్తనలు, ప్రార్థనలతో ప్రతిధ్వనించింది. 11.45 గంటలకు గుండిచా మందిరానికి చేరుకున్న పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్ వరుసక్రమంలో బలభద్ర, జగన్నాథ, సుభద్రల రథాలపైకి వెళ్లి బంగారు చీపురుతో ఊడ్చి చెరాపహరా చేశారు. కస్తూరి చల్లి మంగళహారతి పట్టిన ఆయన చామరసేవలు నిర్వహించారు. తర్వాత మధ్యాహ్నం 1.17 గంటలకు తాళధ్వజ్(బలభద్రుని) రథం శ్రీక్షేత్రం వైపు కదిలింది. భక్తులు జైజగన్నాథ్.. అంటూ నినాదాలు చేస్తూ మూడు రథాలు లాగారు. ఈ దృశ్యం మరోసారి పూరీ బొడొదండో వీధుల్లో నేత్రపర్వం చేసింది. భక్తులు పారవశ్యం పొందారు. శనివారం హరిశయన ఏకాదశి పర్వదినం నేపథ్యంలో శ్రీక్షేత్రం ఎదుట మూడు రథాలపై పురుషోత్తమ, బలభద్ర, సుభద్రల సున్నాభెషొ(స్వర్ణాభరణ అలంకరణ) వేడుక ఏర్పాటు కానుంది.
3. 16న ప్రత్యేక దర్శనాలు రద్దు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుండడం, రాత్రి చంద్రగ్రహణం కారణంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. వయోవృద్ధులు, దివ్యాంగులకు, ఏడాదిలోపు చంటిబిడ్డలతోపాటు తల్లిదండ్రులకు నిత్యం కల్పించే ప్రత్యేక దర్శనాలను ఆ రోజు రద్దు చేసింది. 17న అంగప్రదక్షిణ సేవ కూడా ఉండదు. 16న కేవలం 5 గంటలపాటు మాత్రమే శ్రీవారి దర్శన అవకాశం ఉంటుంది.
4. వరంగల్లో వైభవంగా బోనాల వేడుక
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం వరంగల్లోని కరీమాబాద్, ఉర్సు ప్రాంతాల్లో కురుమ కులస్థులు బోనమెత్తారు. ఉదయం ఆర్య సమాజ్, జాతీయ జెండాలతో బీరన్నస్వామి ఆలయానికి వెళ్లి ఆలయ శిఖరానికి జెండాలు కట్టి ఉత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి తమ ఇలవేల్పు బీరన్నస్వామికి బోనాలు సమర్పించారు. పురుషులు బీరన్న వేషధారణలతో వారిని అనుసరించారు.
5. కంచి వరదరాజస్వామి సేవలో రాష్ట్రపతి
తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అత్తివరదర్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. 40 సంవత్సరాలకు ఒక్కసారి 48 రోజులపాటు జరిగే అత్తివరదర్ ఉత్సవాలు ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రాష్ట్రపతి కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు రానున్నారు. చెన్నై నుంచి సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. 14న ఉదయం వేంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం శ్రీహరికోటకు వెళతారు. షార్ ప్రయోగవేదికపై ఉన్న జీఎస్ఎల్వీ-మార్క్3 వాహక నౌకను వీక్షిస్తారు. 15వ తేదీన జీఎస్ఎల్వీ-మార్క్3 వీక్షిస్తారు.
6. అభయారణ్యంలో.. శివోహం
శైవక్షేత్రాలకు ప్రసిద్ధి అయిన నల్లమల అటవీప్రాంతం తొలి ఏకాదశి సందర్భంగా శుక్రవారం శివనామ స్మరణతో మారుమోగింది. అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంలో ఉన్న శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అచ్చంపేటకు సమీపంలోని ఉమామహేశ్వరం, మన్ననూరు దగ్గరున్న లొద్ది మల్లయ్య క్షేత్రం, అమ్రాబాద్ సమీపంలోని అంతర్గంగ, వటవర్లపల్లి వద్ద ఉన్న మల్లెలతీర్థం క్షేత్రాలు భక్తజనంతో నిండిపోయాయి. భక్తులు లొద్ది మల్లయ్యను సందర్శించేందుకు అటవీశాఖ రెండు రోజులపాటు అనుమతులు ఇవ్వడంతో హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు, కర్నూలు జిల్లాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు, భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక రోజుల్లో మినహాయిస్తే మిగతా సమయాల్లో అటవీశాఖ అధికారులు ఇక్కడికి ఎవరినీ అనుమతించరు. ప్రకృతి అందాలను కాలినడకన తిరుగుతూ వీక్షించాలన్న కోరికతో చాలామంది వచ్చారు.
7. నూతన ఆర్జిత సేవకు శ్రీకారం
సింహాద్రినాథుడి సన్నిధిలో కొత్తగా ప్రవేశపెట్టిన స్వర్ణ తులసీ దళార్చన ప్రత్యేక ఆర్జిత సేవా కార్యక్రమానికి ఆలయ వైదికవర్గాలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టాయి. తొలుత ఆలయ భాండాగారంలోని స్వర్ణ తులసీ దళాలను బయటకు తీసి వెండిపల్లెంలో ఉంచారు. నాదస్వర మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ బంగారు తులసీ దళాలతో ఈవో కె.రామచంద్రమోహన్, అర్చకులు, దాతలు బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామి చెంతన వీటిని ఉంచారు. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు నేతృత్వంలో అర్చకులు పుత్తడి తులసీ దళాలతో స్వామికి తొలిసారిగా అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. దాతలతో పాటు రుసుము చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేసిన 36మంది ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. అర్చన అనంతరం పండితులు ఉభయదాతలను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ఇకపై ప్రతినెలా ఏకాదశి తిథుల్లో ఈ ప్రత్యేక ఆర్జిత సేవ స్వామి సన్నిధిలో జరుగుతుందని ఈవో పేర్కొన్నారు.
8. బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేత
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రోడ్డు మూసివేతతో బద్రీనాథ్లో 200 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దారి మధ్యలో ఉన్న 800 మందిని గోవింద్ ఘాట్ ప్రాంతంలోని గురుద్వారాకు తరలించి వసతి కల్పించారు. భారీవర్షాల వల్ల జాతీయరహదారిపై కొండచరియలు విరిగి పడటంతో వాహనాల రాకపోకలు నిలచిపోయాయి. రోడ్డు మూసివేతతో బద్రీనాథ్ యాత్రికులు అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది యమునోత్రి, గంగోత్రి, కేదారినాథ్, బద్రీనాథ్ ప్రాంతాల సందర్శనకు వచ్చి యాత్రికుల సంఖ్య 15 లక్షలమందికి దాటింది.
9. శబరిమలకు 16 ప్రత్యేక రైలు సర్వీసులు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా శబరిమలకు 16ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్న ట్లు రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 07115 హైదరాబాద్-కొచ్చువేలి ప్రత్యేక రైలు సెప్టెం బరు 7, 14, 21, 28 తేదీల్లో(శనివారం) రాత్రి 9గంటలకు బయలు దేరి నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి మీదగా సోమవారం వేకువజాము న 3.20కి కొచ్చువేలి చేరుకొంటుంది. నెంబరు. 07116 కొచ్చువేలి -హైదరాబాద్ ప్రత్యేక రైలు సెప్టెంబరు 9, 16, 23, 30 తేదీల్లో (సోమవారం) మధ్యాహ్నం 1.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2గంటలకు హైదరా బాద్ చేరుకొంటుంది. నెంబరు. 07117హైదరాబాద్ – ఎర్నాకుళం ప్రత్యేక రైలు సెప్టెంబరులో 4, 11, 18, 25 తేదీల్లో(బుధవారం) మధ్యాహ్నం 1.15గంటలకు బయలుదేరి నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూ రు, తెనాలి మీదగా మరుసటి రోజు సాయంత్రం 5.30గంటలకు ఎర్నాకుళం చేరుకొంటుంది. నెంబరు. 07118 ఎర్నాకుళం – హైదరాబాద్ ప్రత్యేక రైలు సెప్టెంబరు 5, 12, 19, 26(గురువారం) తేదీల్లో రాత్రి 10.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.55 గంటలకు హైదరాబాద్ చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్, త్రీటైర్, స్లీపర్క్లాస్, జనరల్ బోగీలుంటాయని సీపీఆర్వో తెలిపారు.
10. భక్తి పారవశ్యం.. లొద్దిమల్లయ్య క్షేత్రం భక్తులతో కిటకిట
శుక్రవారం ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లాలోని మన్యంకొండ, కురుమూర్తి స్వామిని వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు.అమ్రాబాద్ మండలంలోని దట్టమైన అడవిలో వెలిసిన లొద్ది మల్లయ్య, మల్లెల తీర్థం క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై మన్ననూర్ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగమయ్య స్వామికి ఇక్కడి చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు.3 కిలోమీటర్ల మేర కాలినడకన భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. సుమారు 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శంభో శంకర హర హర మహదేవా.. వస్తున్నాం లింగమయ్య.. వెళ్లోస్తాం లింగమయ్య అనే నామస్మరణతో నల్లమల మార్మోగిపోయింది.
11. ఘనాక్రమంలో భద్రకాళి
వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరి మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం ఘనాక్రమంలో, సాయంత్రం నీలపతాక్రమంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ దంపతులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో అర్చకులు, ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే వినయ్భాస్కర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
12. యాదాద్రి దేవుడికి బంగారు పూలు వెండి పళ్లెం…
యాదాద్రీశుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి బంగారంతో చేసిన 108 పుష్పాలు, కిలో వెండి పళ్ళెంను హైద్రాబాద్‌కు చెందిన రూపసంతోషిని జ్యువెల్లరీ యజమాని శారద కుటుంబ సభ్యులు స్వామి వారికి బహుకరించారు. శుక్రవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారి దర్శనార్థం వచ్చిన వారు గ్రాము బంగారంతో ఒక్కో పుష్పం చొప్పున 108 పుష్పాలను మొత్తం 108 గ్రాముల బంగారంతో తయారు చేయించి స్వామి వారి పుష్పార్చన పూజకు ఉపయోగించే విధంగా కిలో వెండితో తయారు చేసినటువంటి వెండి పళ్ళెంను జ్యువెల్లరీ దుకాణ యజమాని యాదాద్రి దేవస్థాన ఈఓ గీత, అర్చకులు అందచేశారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న దాత భక్త కుటుంబానికి అర్చకులు స్వామి వారి ఆశీర్వచనంతో పాటు తీర్ధ ప్రసాదాన్ని అందచేశారు.
13. శుభమస్తు – నేటి పంచాంగం
తేది : 13, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 10 ని॥ వరకు)
నక్షత్రం : అనూరాధ
(ఈరోజు సాయంత్రం 6 గం॥ 11 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 11 గం॥ 51 ని॥ నుంచి 1 గం॥ 58 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 6 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
గుళికలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 26 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 37 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 48 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
14చరిత్రలో ఈ రోజు* జులై, 13*
* సంఘటనలు*
1930: మొదటి ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.
* జననాలు*
1915: గుత్తి రామకృష్ణ, ప్రముఖ కథకుడు, పాత్రికేయుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
1924: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006)
1941: టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు.
1964: ఉత్పల్ చటర్జీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1987: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (మ.2010)
* మరణాలు*
2013: కోడి సర్వయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.
15. రాశిఫలం -07/13/2019
తిథి:
శుద్ధ ద్వాదశి రా.1.14, కలియుగం – 5121 శాలివాహన శకం – 1941
నక్షత్రం:
అనూరాధ సా.6.15
వర్జ్యం:
రా.11.54 నుండి 1.30 వరకు
దుర్ముహూర్తం:
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు లం:
ఉ.9.00 నుండి 10.30 వరకు విశేషాలు: మధ్వానాం ఏకాదశి, వాసుదేవ ద్వాదశిచాతుర్మాస్య గో, పద్మ వ్రతాలు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలుంటాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురవుతాయ. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనారోగ్య బాధలు అధికమవుతాయి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
16. తిరుమల సమాచారం*
*ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు శనివారం *13-07-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ……
శ్రీవారి దర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు…
శ్రీ వారి సర్వ దర్శనానికి *24* గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *6* గంటల సమయం పడుతోంది..
నిన్న జూన్ *12* న *70,669* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *3.17* కోట్లు.
17. శ్రీవారికి రూ.కోటి విరాళం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తుడు శనివారం రూ.కోటి విరాళం సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన ఎమ్.భూపతిరాజు, శారద దంపతులు శ్రీవారి ఆలయంలో తితిదే అధ్యక్షుడు వై.వి. సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేక అధికారి ఎ.వి. ధర్మారెడ్డిని కలిసి విరాళాలకు సంబంధించిన డీడీని అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కింద డిపాజిట్టు చేయాలని దాత కోరారు. భారీ మొత్తంలో విరాళం ఇచ్చిన దాతలను సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు వారికి అందించారు.
18. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్ శివన్, పలువురు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు.అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శివన్ మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎమ్1 వాహకనౌక ద్వారా చంద్రయాన్-2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు.
19. పద్మాువతి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ దంపతులు శనివారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్, డిప్యూటీ ఈవో ఝాన్సీ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిం చినట్లు తెలిపారు.
20. చెంగాళమ్మ సేవలో ఇస్రో అధిపతి
సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి శనివారం ఇస్రో అధిపతి డా.కైలాసవాడివో శివన్ విచ్చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 15న శ్రీహరి రాకెట్ కేంద్రం నుంచి పంపనున్న చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావాలని ఆయన మొక్కుకున్నారు. ఆయన వెంట సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ ఉన్నారు.
వరదరాజ పెరుమాళ్ 40ఏళ్లకు ఓసారి మాత్రమే బయటకి వస్తాడు
Related tags :