దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాలు మొదలుపెట్టి డబ్బును ప్యాలెస్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడమే కాదు.. నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.
‘‘మద్యం దుకాణాల్లో ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు. చంద్రబాబు (ChandraBabu) అమలు చేసిన ఉచిత ఇసుక విధానంపైనా అక్కసు వెళ్లగక్కారు. ఇసుక లభించక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఆదాయం వచ్చే శాఖల్లో మీ సామాజిక వర్గానికి చెందినవారినే నియమించుకున్నారు. వచ్చేది తెదేపా (TDP) ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం. అర్హతలేని వ్యక్తిని తితిదే ఈవోగా నియమించారు. తితిదేలో జగన్.. తన బంధువులను నియమించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయటమా జగన్ రెడ్డి?’’ అని అచ్చెన్న ప్రశ్నించారు.
👉 – Please join our whatsapp channel here –