* ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ
ప్రముఖ నగల వ్యాపార సంస్థ జోస్ ఆలుక్కాస్ అండ్ సన్స్‌లో భారీ చోరీ చోటుచేసుకుంది. తమిళనాడు కోయంబత్తూరులోని గాంధీపురంలో వున్న జోస్ ఆలుక్కాస్ దుకాణంలో దాదాపు 25కిలోల బంగారు ఆభరణాలు దోపిడీకి గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి 2.30గంటల సమయంలో దుకాణంలోకి చొరబడినట్టుగా ఆ వీడియోలో రికార్డయ్యాయిఈ ఘటనపై కోయంబత్తూరు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ ఘటనలో ఒకే అనుమానితుడు వున్నట్టు తెలుస్తోందన్నారు. నిందితుడి కోసం గాలించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసిన ఉద్యోగులు.. ఉదయం మళ్లీ వచ్చి చూసేసరికి లోపల అంతా చెల్లాచెదురుగా పడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం లోపలికి వెళ్లి పరిశీలించగా.. దుకాణం వెనుక గోడ పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు గుర్తించి అంతా షాకైనట్లు సమాచారం. ఈ దోపిడీ ఘటనపై వెంటనే దుకాణం యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. దోపిడీ చేసిన నగల విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* సీఐపై కాంగ్రెస్ నేత దాడి!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పలు చోట్ల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా ఓ పోలీసు అధికారి కారులో డబ్బు తరలిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు అడ్డుకుని దాడికి చేశారు. వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా చెంగిచర్ల దగ్గర కారులో డబ్బుల సంచుల కలకలం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కారును అడ్డుకుని తనిఖీలు చేశారు. కారులో నగుదు ఉన్న సంచులను గుర్తించారు. అనంతరం, ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు వచ్చి నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావుగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు. బీఆర్‌ఎస్ నేతలు కారులో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణ చేశారు. దీంతో, ఆవేశంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త.. సీఐ అంజిత్ రావుపై దాడి చేశాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, దొరికిన డబ్బును మంత్రి మల్లారెడ్డికి చెందినది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
* సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన బలరాం రమేష్ (26) అనే యువకుడు బాలిలో శవమై తేలాడు. అదే గ్రామానికి చెందిన యువతిని రమేస్ ప్రేమించినట్లు తెలిసింది. యువతి కుటుంబీకులే రమేష్ ను చంపి బావిలో వేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. యువతి ఇంటి ఎదుట రమేష్ డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో భారీగా పోలీసులను శ్రీగిరిపల్లిలో మోహరించారు.
* ఆరేళ్ల బాలిక కిడ్నాప్
ఆరేళ్ల బాలిక కిడ్నాప్ ఘటనలో 21 గంటల తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. సోమవారం సాయంత్రం నుంచి కేరళ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కిడ్నాపర్లు.. కొల్లాం ఆశ్రమం గ్రౌండ్‌లో బాలికను వదిలపెట్టి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల సమయంలో కొల్లాంలోని (Kollam) పోయప్పల్లిలో ట్యూషన్‌కు వెళ్తున్న బాలికను దుండగులు అపహరించారు. ఆమె పక్కనే ఉన్న 8 ఏళ్ల సోదరుడు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పక్కకి విసిరేయడంతో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆ బాలుడు జరిగిన విషయాన్ని ఇంటికొచ్చి తన తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడికి నిమిషాల వ్యవధిలోనే దుండగులు వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే.. చిన్నారి ప్రాణాలు తీస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని హెచ్చరించారు.దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు గంటల కొద్దీ గాలింపు చర్యలు చేపట్టినా.. ఫలితం లేకపోయింది. ఈలోగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొందరు యువకులు పోయప్పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కొల్లాం, పథనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో విస్త్రృతంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు కిడ్నాపర్లు, బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన ఫోన్‌కాల్స్ కూడా స్థానిక ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. దీంతో భయపడిన కిడ్నాపర్లు బాలికను కొల్లాం ఆశ్రమం గ్రౌండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు.బాధిత బాలిక సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు తెల్లరంగు కారులో వచ్చి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. బాలుడు చెప్పిన వివరాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులు రెండు వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా పని చేస్తున్నారు. బాలికను కిడ్నాప్ చేయడానికి గల కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
* భారీగా మద్యం పట్టివేత
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలో రూ.4లక్షల విలువగల 47 కాటన్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు. దగడపల్లికి చెందిన వెంకట్రావు ఇంట్లో 29 కాటన్లు, కుమ్మరి రమేష్ ఇంట్లో 3 కాటన్లు, కుమ్మరి శంకరయ్య ఇంట్లో 17 కాటన్ల మద్యం నిల్వ చేయగా, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ కళ్యాణ్, స్పెషల్ పార్టీ పోలీస్ రవినాయక్, వీపనగండ్ల ఎస్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు.
* ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
కన్న కూమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే.. అత్యంత నీచానికి దిగజారిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ‘ఓ మహిళ కొన్నేళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రియుడు శిశుపాలన్‌తో అనే వ్యక్తితో కలిసి జీవిస్తోంది. వీరితో పాటుగా ఆ మహిళకు ఏడేళ్ల కుమార్తె కూడా ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత శిశుపాలన్ కన్ను ఆమె ఏడేళ్ల కూతురుపై పడింది.ఆ బాలికను ఎలాగైనా లొంగదీసుకోవాలని చూశాడు. ఈ దారుణానికి కన్న తల్లే సహకరించింది. ఇలా 2018 నుంచి 2019 వరకు తల్లి సపోర్ట్‌తో శిశుపాలన్ ఆ చిన్నారిపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నరకయాతనను ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక ఆ చిన్నారి ఎంతో కుమిలిపోయింది. ఏడాది తర్వాత ఎలాగోల అక్కడి నుంచి తప్పించుకుని.. తమ అమ్మమ్మ ఇంటికి పారిపోయింది. జరిగినదంతా.. తన అమ్మమ్మకు వివరించగా.. బాలికను తీసుకొని చిల్డ్రన్ హోమ్‌కు వెళ్లింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యప్తు కొనసాగించారు. ఈ కేసులో తిరువనంతపురం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపింది. పోలీసులు 22 మంది సాక్షులను విచారించి 32 డాక్యుమెంట్లను సమర్పించారు. శిశుపాలన్ బాలికపై అత్యాచారం చేశాడని, దీంతో బాధితురాలి ప్రైవేట్ భాగాలకు గాయాలయ్యాయని కోర్టు గుర్తించింది. అయితే శిశు పాలన్ సూసైడ్ చేసుకున్నాడు.దీంతో కోర్టు తాజాగా సొంత కుమార్తెపై అత్యాచారానికి సహకరించినందుకు 40 ఏళ్ల 6 నెలల కఠిన జైలు శిక్ష.. అలాగే 20 వేల జరిమానా విధించారు. ప్రస్తుతం తల్లికి మాత్రమే కోర్టు జైలు శిక్ష విధించింది. నిందితులు ఒకవేళ జరిమానా కనుక చెల్లించకపోతే అదనంగా 6 నెలల కారాగారా శిక్ష అమలు చేస్తామని కోర్టు హెచ్చరించింది.
* మరో నీట్ విద్యార్ధి ఆత్మహత్య!
రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది కోటాలో తనువు చాలించిన విద్యార్ధుల సంఖ్య 28కి చేరింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ విద్యార్ధుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేక పోతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫోరిడ్ అనే విద్యార్ధి కోటలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలో ప్రైవేట్ హాస్టల్‌లో నివసిస్తూ.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ నిన్న సాయంత్రం తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు.వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరిడ్ ఉంటోన్న హాస్టల్‌లోని ఇతర విద్యార్థులు సాయంత్రం 4 గంటలకు అతన్ని చివరిసారిగా చూశామని పోలీసులకు చెప్పారు. రాత్రి 7 గంటల వరకు అతను తన గది నుండి బయటకు రాకపోవడంతో విద్యార్ధులకు అనుమానం వచ్చింది. పైగా వారి ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో వెంటనే హాస్టల్ యాజమన్యానికి తెలియజేశారు. హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.కాగా విద్యార్ధి గదిలో సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. ఫోరీడ్ గతేడాది నుంచి కోటాలో కోచింగ్ తీసుకుంటున్నాడు. దీంతో కోటాలో నమోదవుతోన్న వరుస ఆత్మహత్యలు మరోమారు చర్చకు వచ్చాయి. విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్యం, స్ట్రెస్ వారిని మరణం వైపు ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. ఈ ఆందోళనకరమైన ధోరణికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలను జారీ చేసింది కూడా. ఆ మార్గదర్శకాల్లో భాగంగా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
* మద్యం దుకాణం సీజ్
జిల్లా కేంద్రంలోని న్యూబాలాజీ మద్యం దుకాణాన్ని ఆదివారం రాత్రి ఎన్నికల వ్యయ పరిశీలకుడు, ఐఆర్‌ఎస్ అధికారి కుందన్‌యాదవ్ తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించినట్లు గుర్తించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఈఎస్ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ మద్యం దుకాణంలో స్టాక్ పరిశీలించి సీజ్ చేశారు. సదరు దుకాణాదారుడి లైసెన్స్ రద్దు చేశారు. దుకాణంలో రూ.8లక్షల విలువగల స్టాక్ ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల కిందట జహంగీర్ అనే వ్యక్తి రూ.2లక్షల విలువగల మద్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –