సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేసిన కేసు విషయంలో సీబీఐ విచారణకు సినీ నటుడు విశాల్ హాజరయ్యారు. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
సీబీఎఫ్సీపై తాను చేసిన ఆరోపణలపై మంగళవారం (నవంబర్ 28న) తాను ముంబైలోని సీబీఐ కార్యాలయానికి హాజరు అయ్యానని చెప్పారు విశాల్. సీబీఐ విచారణ తనకు కొత్త అనుభవం నేర్పిందని, దర్యాప్తు జరుగుతున్న తీరు కూడా తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
తాను కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్తానని తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా చెప్పారు విశాల్. రీల్ లైఫ్‌లోనే కాకుండా నిజ జీవితంలో కూడా అవినీతికి వ్యతిరేకంగా నిలబడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రెండు నెలల క్రితం.. తమిళ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మార్క్ ఆంటోనీ(Mark Antony) హిందీ సెన్సార్ కోసం రూ.6.5 లక్షల లంచం అడిగారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముంబై సెన్సార్ బోర్డుపై కేసు నమోదు చేసింది.
విశాల్ ఫిర్యాదు ఆధారంగా.. సీబీఐ అధికారులు అక్టోబర్ మొదటి వారంలో కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా.. ముగ్గురు మధ్యవర్తులతో పాటు ముంబై సీబీఎఫ్‌సీకి చెందిన మరికొందరిపైనా విచారణ చేపట్టారు. అంతటితో ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నారంతా కానీ.. ఇప్పుడు తాజాగా విశాల్ తనకు సీబీఐ నుండి పిలుపు వచ్చిందని విచారణకు వెళ్లే ముందే చెప్పారు.
తాను CBFC కేసు విచారణ కోసం ముంబైలోని CBI ఆఫీస్ కు వెళ్తున్నానని, ఈ ఆఫీసుకి వెళ్తానని తన జీవితంలో అనుకోలేదంటూ ఎక్స్ (ట్విట్టర్ )లో రాసుకొచ్చారు విశాల్.
ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే మార్క్ ఆంటోనీ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విశాల్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ హరితో ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
👉 – Please join our whatsapp channel here –