DailyDose

త్వరలో పెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్-వాణిజ్య-07/13

India To Emerge As Largest Economy Soon - Daily Business News - July 13 2019

* ప్రస్తుత సంవత్సరంలో బ్రిటన్ను వెనక్కినెట్టి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక వెల్లడించింది. 2025 కల్లా జీడీపీ 5.9 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. తద్వారా ఆ ఏడాదిలో జపాన్ను కూడా అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పేర్కొంది. భారత వినియోగ విపణి పరిమాణం కూడా ప్రస్తుతమున్న 1.9 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. ‘ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ ర్యాంకును మెరుగుపడే కొద్ది ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత భాగస్వామ్యమూ పెరుగుతుంది. భారత వినియోగ విపణి పరిమాణం వేగంగా వృద్ధి చెందుతుండటంతో ఆసియా పసిఫిక్ ప్రాంత వృద్ధిలో ముఖ్య భూమిక భారత్దే అవుతుంది. ఆసియా ప్రాంతంలో వాణిజ్యం, పెట్టుబడులు పురోగతికి ఈ పరిణామం దోహదం చేస్తుంద’ని ఐహెచ్ఎస్ వెల్లడించింది. అయితే దీనిని సాధించాలంటే వచ్చే ఐదేళ్లలో సుస్థిర వృద్ధిని కొనసాగాల్సి ఉంటుందని పేర్కొంది. అందుకే ఇటీవల నిర్దేశించుకున్న ఆర్థిక వ్యవస్థ వృద్ధి మార్గసూచీలో పెట్టుబడులు, పొదుపు, ఎగుమతుల వృద్ధి అవసరాన్ని భారత్ గుర్తించిందని వెల్లడించింది. ఆవిష్కరణలకు, ఉత్పాదకతలో గణనీయ వృద్ధికి, కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు, ఉద్యోగాల సృష్టికి పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. అంకుర సంస్థల అభివృద్ధిని వేగం చేయడం కూడా నైపుణ్య ఉద్యోగాల వృద్ధిలో కీలక వ్యూహం అవుతుందని వెల్లడించింది.
* ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'(ఎస్‌బీఐ) తన వినియోగదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అని వేళలా జరిపే ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను ఎత్తేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే వివిధ యాప్ లద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు ఊరట లభించినట్లయింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
*జెట్ ఎయిర్వేస్ దివాలా కేసులో డచ్ కోర్టు ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినడానికి ద నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) అంగీకరించింది. దిగువ కోర్టుల ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
*హైదరాబాద్ శివార్లలోని బొల్లారంలో కల డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్కు చెందిన ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్) యూనిట్ను తనిఖీ చేసిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) బృందం కొన్ని లోటుపాట్లను గుర్తించింది.
*ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి కర్ణాటక బ్యాంక్ రూ.175.42 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది బ్యాంకుకు జీవన కాల గరిష్ఠ లాభం. ఏడాదిక్రితం ఇదే సమయంలో నమోదైన రూ.163.24 కోట్లతో పోలిస్తే ఈసారి లాభం 7 శాతం పెరిగింది.
* ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.1,433 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*నమోదిత(లిస్టెడ్) కంపెనీలు చేపడుతున్న షేర్ల తిరిగి కొనుగోలు(బైబ్యాక్)పై 20 శాతం పన్ను విధించాలన్న బడ్జెట్ ప్రతిపాదన అంశాన్ని పరిశీలిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
*రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఆరో నెలా పెరిగింది. పప్పుధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే చేపలు, మాంసం లాంటి ఆహార పదర్థాలు ప్రియం కావడం ఇందుకు కారణమైంది.
*భదత్రాపరమైన అంశాల్లో వైఫల్యాల కారణంగా ఇండిగోకు చెందిన నలుగురు ఉన్నతాధికారులకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. గుర్గ్రామ్లోని ఇండిగో కార్యాలయంలో జులై 8, 9 తేదీల్లో జరిపిన ప్రత్యేక ఆడిట్లో ఈ వైఫల్యాలను డీజీసీఏ గుర్తించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
*టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి తొలి ఇథనాల్ ఆధారిత మోటార్ సైకిల్ విపణిలోకి వచ్చింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 ఫి ఈ100 పేరుతో రూపొందించిన ఈ బైకు ధరను రూ.1,20,000గా నిర్ణయించింది.
*సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్) తమ జిక్సర్ మోడల్లో కొత్త వెర్షన్ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,00,212 (ఎక్స్-షోరూమ్, దిల్లీ). 155 సీసీ, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ సామర్థ్యంతో దీన్ని రూపొందించింది.
* మన దేశం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు 55 సంవత్సరాలు పట్టిందని, అదే 2014-19 సంవత్సరాల మధ్య 1.7 ట్రి.డా. నుంచి 2.7 ట్రి.డా.కు చేరిందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు
*హైదరాబాద్ కేంద్రంగా ట్రూజెట్ బ్రాండ్పై విమానయాన సేవలందిస్తున్న టర్బోమేఘా…, ఇతర దేశాల నుంచి నేరుగా మనదేశంలోని చిన్న పట్టణాలకు ఒకే టికెట్పై ప్రయాణించే వీలు కల్పించనుంది.
*ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే తక్షణ నగదు బదిలీ సేవలపై (ఐఎంపీఎస్) ఛార్జీలను ఎత్తివేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. ఆగస్టు 1 నుంచి ఛార్జీల తొలగింపును అమల్లోకి తీసుకొని రానుంది.
*వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే ఏటా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ పేర్కొన్నారు. అందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని సూచించారు.