అక్కడే పుట్టి పెరిగి.. ఉన్నత చదువులు చదివి.. 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి.. చివరకు ఆ దేశ పౌరుడు కాదనే విషయం తెలిస్తే ఎలా ఉంటుంది. షాక్‌కు గురికావడం ఖాయం. ఇటువంటి అనూహ్య పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. పాస్‌పోర్టు రెన్యూవల్ (Passport Renewal) కోసం దరఖాస్తు చేసుకుంటే ఏకంగా దేశ పౌరసత్వమే (US citizenship) కోల్పోయిన పరిస్థితి వర్జీనియాకు చెందిన వైద్య నిపుణుడికి ఎదురయ్యింది. ఓ అంతర్జాతీయ వార్తాపత్రిక కథనం ప్రకారం..
వర్జీనియాకు చెందిన సియావాశ్ శోభానీ (Siavash Sobhani) అమెరికాలో జన్మించారు. అక్కడే వైద్యవిద్యను అభ్యసించిన ఆయన.. గడిచిన 30ఏళ్లుగా అదే వృత్తిలో సేవలందిస్తున్నారు. 62ఏళ్ల వయసున్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పాస్‌పోర్టు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎన్నోసార్లు రెన్యూవల్ చేసుకున్నందున.. ఈసారి కూడా తేలికగానే వస్తుందనుకున్నారు. కానీ, అధికారులు ఇచ్చిన ట్విస్ట్ చూసి కంగుతిన్నారు. అసలు మీరు అమెరికా పౌరుడే (American Citizen) కాదని.. అధికారుల పొరపాటుతో బాల్యంలో ఉన్నప్పుడు పౌరసత్వం జారీ అయ్యిందని పేర్కొనడంతో శోభానీ షాక్‌కు గురికాక తప్పలేదు.
‘నేను వైద్యుడిని. నా జీవితం మొత్తం ఇక్కడే గడిసింది. పన్నులు కూడా కట్టాను. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశాను. ఉత్తర వర్జీనియాలో స్థానికంగా ఎంతో సేవలందించాను. కొవిడ్ సమయంలో నాకు, నా కుటుంబానికి ఎంతో ముప్పు ఉన్నప్పటికీ.. పనిచేశాం. ఇలా 61ఏళ్ల వయసు వచ్చిన తర్వాత.. ‘మీరు అమెరికా పౌరుడు కాదు, పొరపాటు జరిగింది’ అని అధికారులు చెప్పడం నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని సియావాశ్ శోభానీ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం.. సియావాశ్ శోభానీ జన్మించినప్పుడు ఆయన తండ్రి ఇరాన్ దౌత్యవేత్తగా ఉన్నారట. డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉన్న తల్లిదండ్రులకు అమెరికాలో పిల్లలు జన్మిస్తే.. వారు నేరుగా అమెరికా పౌరసత్వం పొందలేరు. ఈ క్రమంలో శోభానీకి పౌరసత్వం ఇవ్వకూడదు. కానీ, అధికారుల పొరపాటు వల్ల ఆయనకు పౌరసత్వం వచ్చిందని అమెరికా విదేశాంగ పంపించిన లేఖలో పేర్కొంది. అయితే, త్వరలోనే తాను రిటైర్మెంట్ కాబోతున్నానని.. అనంతరం విదేశీ ప్రయాణాలు చేయాలని భావిస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఎదురుకావడం ఇబ్బందిగా మారిందని శోభానీ పేర్కొన్నారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే దాదాపు 40వేల డాలర్లు ఖర్చు పెట్టానన్న ఆయన.. మరో ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –