దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వంటి సవాళ్లున్నా ఈ రంగ వృద్ధి బలంగా ఉండబోతోందని పేర్కొన్నారు. బెంగళూరు టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఐటీ రంగంపై మాట్లాడారు. ‘గత ఏడాది ఐటీ పరిశ్రమ సుమారు 9 శాతం వృద్ధి చెంది 200 బిలియన్ డాలర్ల (సమారు 16.60 లక్షల కోట్ల)కు చేరింది. 2030 నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న నమ్మకం ఉంది. కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక మందగమనం ఉన్నా, ఐటీ రంగం మాత్రం ఏటా నిర్విరామంగా వృద్ధి సాధిస్తోంద’ని గోపాలకృష్ణన్ వెల్లడించారు. భారత్ సహా అంతర్జాతీయంగా ఉన్న పలు ఐటీ సంస్థలు సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో క్రిస్ సానుకూలంగా మాట్లాడటం విశేషం. 2021-22లో 15.5 శాతం వృద్ధి సాధించిన ఐటీ పరిశ్రమ, 2022-23లో 8.4 శాతమే వృద్ది చెందిందని ఇటీవలే నాస్కామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగ వృద్ధి 3-5 శాతానికి పరిమితం కావచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొనడం గమనార్హం.
👉 – Please join our whatsapp channel here –