తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని ఎన్నికల్లో (Telangana Elections 2023) లబ్ధికి సీఎం కేసీఆర్ (KCR) పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ (Nagarjuna sagar) ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రేవంత్ స్పందించారు.
‘‘రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవాళ్లు.. సమస్యను అర్థం చేసుకోగలిగేవాళ్లు. ఎవరు? ఎందుకు? ఏం ఆశించి ఇలా చేస్తున్నారనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. వ్యూహాత్మకంగానే అలా చేశారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదిన్నర సంవత్సరాలు అయింది. నాగార్జున సాగర్ ఎక్కడికీ పోదు.. గేట్లూ ఎక్కడికీ పోవు.. నీళ్లూ అక్కడే ఉంటాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఈవో బాధ్యత తీసుకుని ఆ అంశంపై చర్చించాలి. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగకుండా చూడాలి.
కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం రావాలంటే ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలి. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏపీ సహా ఏ రాష్ట్రంతో నీటి సమస్యలు ఉన్నా కూర్చొని చర్చించుకుని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాం. రెండు దేశాలే ప్రాజెక్టుల్లో నీటిని పంచుకోవడంలో ఇబ్బంది లేనపుడు రాష్ట్రాల మధ్య పంపకాలకు ఎందుకు ఇబ్బంది? కృష్ణా, గోదావరి జలాలు, ఆస్తుల పంపకాలు, ఇతర వివాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సమన్వయంతో పరిష్కరిస్తుంది. ప్రజలు భారాస కుట్రల్లో పడొద్దు. ఆఖరి ప్రయత్నం చేస్తూ దింపుడు కళ్లెం ఆశగా ఇలాంటి వాటిని ఆ పార్టీ చేస్తోంది’’ అని రేవంత్ ఆరోపించారు.
👉 – Please join our whatsapp channel here –