బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) పొదుపు, బీమాతోపాటు, హామీతో కూడిన ఆదాయాన్ని అందించేలా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్ ఉత్సవ్. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవితాంతం వరకూ బీమా రక్షణ అందించే పాలసీ. ఒకసారి ఈ పాలసీ తీసుకుంటే.. ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాతా జీవితాంతం వరకూ పాలసీ విలువలో 10 శాతం వరకూ ఆదాయంగా పొందొచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి, వేచి ఉండే కాలం తర్వాత ఏటా ఆదాయం అందిస్తుంది. ఇలా అవసరం లేదనుకుంటే.. ఫ్లెక్సీ విధానం ఎంచుకోవచ్చు. అప్పుడు చక్రవడ్డీ ప్రయోజనం లభిస్తుంది. పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకూ బీమా రక్షణ (హోల్ లైఫ్) లభిస్తుంది. ప్రీమియం చెల్లించే కాలానికి రూ.1,000కి రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్ ఉంటుంది.
ఈ పాలసీని కనీసం 90 రోజుల వయసు నుంచి 65 ఏళ్ల వరకూ తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లించేందుకు గరిష్ఠ వయసు 75 ఏళ్లు. కనీసం 5 నుంచి 16 ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కనీస బీమా విలువ రూ.5లక్షలు. ఎంచుకున్న వ్యవధిని బట్టి, వేచి ఉండే వ్యవధి ఆధారపడి ఉంటుంది. అయిదేళ్లు ప్రీమియం చెల్లిస్తే.. వేచి ఉండే వ్యవధి అయిదేళ్లు ఉంటుంది. అదే ఆరేళ్లు ప్రీమియం చెల్లిస్తే.. నాలుగేళ్లు వేచి ఉండాలి. అంటే.. పాలసీ తీసుకున్న 10 ఏళ్ల తర్వాతే ఆదాయం రావడం ప్రారంభం అవుతుందన్నమాట. అక్కడి నుంచి పాలసీ విలువలో 10 శాతం చొప్పున జీవితాంతం వరకూ ఆదాయం లభిస్తుంది. బీమా హామీ ఉంటుంది.
ఈ పాలసీలో రెండు రకాల ఐచ్ఛికాలున్నాయి. ఒకటి క్రమం తప్పకుండా ఆదాయం. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఏటా పాలసీ విలువలో 10 శాతం ఆదాయం వస్తుంది. అదే రెండో ఐచ్ఛికంలో ఇలా లభించే ఆదాయాన్ని ఎల్‌ఐసీ వద్దనే ఉంచొచ్చు. అప్పుడు 5.5 శాతం చొప్పున చక్రవడ్డీ జమ అవుతుంది. కావాలంటే.. జమైన మొత్తం నుంచి 75 శాతం మేరకు ఉపసంహరించుకోవచ్చు.
పాలసీదారుడు మరణిస్తే.. జమైన మొత్తంతోపాటు, ఇతర ప్రయోజనాలు అందుతాయి. పాలసీ వ్యవధిలోనే పాలసీదారుడు మరణిస్తే.. పాలసీ విలువను పరిహారంగా చెల్లిస్తారు. దీంతోపాటు గ్యారంటీడ్ అడిషన్స్‌నూ చెల్లిస్తారు. వార్షిక ప్రీమియానికి 7 రెట్ల వరకూ బీమా ఉంటుంది.
ఈ పాలసీకి రైడర్లనూ జత చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ యాక్సిడెంటల్ డెత్, డిజేబిలిటీ బెనిఫిట్, యాక్సిడెంట్ బెనిఫిట్, న్యూటర్మ్ అస్యూరెన్స్, న్యూ క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్, ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్లను జోడించుకోవచ్చు.
ఎంపిక చేసుకున్న పాలసీ విలువను బట్టి, ప్రీమియం ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి అయిదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌తో పాలసీని తీసుకుంటే.. ఏటా రూ.2.17 లక్షల వరకూ ప్రీమియం ఉంటుంది.
👉 – Please join our whatsapp channel here –