అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు రాక్షసాయుతంగా హింసించి, బంధించి, వేధించిన కారణంగా సత్తారు వెంకటేష్ రెడ్డిని, అతనికి సహకరించిన మరో ఇరువురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే…సెయింట్ లూయిస్ నగరానికి 45నిముషాల దూరంలోని డిఫాయెన్స్ పట్టణంలోని ఓ రెస్టారెంట్లో అనుమానస్పదంగా కనిపించిన బాధిత యువకుడి వద్దకు స్థానిక వ్యక్తి ఒకరు వెళ్లి తన ఫోను నెంబరు ఇచ్చాడు. అనంతరం ఆ వ్యక్తితో బాధితుడు వాట్సాప్ ద్వారా తనను ఏ రకంగా వేధిస్తుంది వివరించాడు. ఆ భయానక సమాచారం విని చలించిన ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులను గృహంలోకి నిరాకరించిన సత్తారు, అతని సహచరులు… బాధితుడు తనంతటా తానే బయటకు పరుగెత్తుకొచ్చి పోలీసుల సాయం కోరడంతో వీరి అరాచకాలు బయటపడ్డాయి.
నుదుటి నుండి పాదాల వరకు బాధిత యువకుడి శరీరంపై గాట్లు, గాయాలు, పక్కటెముకలతో పాటు పలుచోట్ల విరిగిన ఎముకలను పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ నుండి నవంబరు 2023 మధ్య 7 నెలల పాటు బాధిత యువకుడిని సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు పెన్మత్స నిఖిల్, శ్రబన్ పెనుమచ్చలు పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లతో ప్రతిరోజు చితకబాదేవారు. ఇంట్లో పనితో పాటు వెంకటేష్ ఐటీ కంపెనీలో ఉద్యోగం అనంతరం 2గంటల పాటు వెంకటేష్‌కి మసాజ్ చేయాలని, వారు చెప్పిన పనులు చేసినా చేయకపోయినా తనను తీవ్రంగా కొట్టేవారని బాధితుడు వాపోయాడు. ఇంటి బేస్మెంట్లో నేలమీద పొడుకోమనేవారని, తనను ప్రతిక్షణం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేవారని బాధితుడు తెలిపాడు.
సత్తారు ఇంట్లో లేనప్పుడు నిఖిల్, శ్రవన్లు వచ్చి తనను దారుణంగా హింసించేవారని, ఇదంతా సత్తారుకు లైవ్‌లో చూపించేవారని బాధితుడు పోలీసులకు తెలిపారు. సత్తారు తనను తాను స్వదేశంలో చాలా శక్తిమంతమైన నేతగా ప్రచారం చేసుకుని బాధితుడిని బెదిరించినట్లు కూడా పోలీసులు తెలిపారు. తనకు కేవలం ఒకరోజులో 3గంటలు మాత్రమే నిద్రపోయేందుకు అనుమతించేవారని బాధితుడు పేర్కొన్నాడు. అమెరికాకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 7నెలల్లో బాధితుడు 30కిలోలు తగ్గాడని పోలీసులు తెలిపారు. బాధితుడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సలో అందిస్తున్నారు.
సత్తారు వెంకటేష్ రెడ్డి వద్దకు ఈ యువకుడు ఎలా వచ్చాడు? ఈ దారుణ హింసాకాండకు గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ రెడ్డి, నిఖిల్, శ్రబణ్లను నాన్-బెయిలబుల్ వారంట్‌పై అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా, హింసాత్మక సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z
Official Case Record: https://www.courts.mo.gov/cnet/cases/newHeader.do?inputVO.caseNumber=2311-CR04219&inputVO.courtId=CT11#header
Other Media Reports: