సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నాడని భారతీయుడిపై అమెరికా(USA) అభియోగాలను మోపింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని గురువారం శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వ్యాఖ్యానించారు. మరోపక్క భారత్(India)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకునే దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తామని అన్నారు.
కిర్బీ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతోంది. ఆ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా మా చర్యలుంటాయి. అలాగే అమెరికాలో హత్యకు జరిగిన కుట్రను, ఆ కేసు దర్యాప్తును తీవ్రంగా తీసుకుంటాం. ఈ కేసును భారత్ కూడా సీరియస్‌గా తీసుకోవడం పట్ల మేం సంతోషంగా ఉన్నాం’ అని అన్నారు.
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నాడని(Murder Plot) భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడం ఆందోళన కలిగించే విషయమని గురువారం భారత్ అభిప్రాయపడింది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇందులో ఒక భారత అధికారి ప్రమేయముందని ఆరోపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది. దీనిపై ఎక్కువగా మాట్లాడలేం. అలాగే ఈ కేసు గురించి ఇప్పటికే నేరుగా న్యూదిల్లీ వద్ద ప్రస్తావించాం. అక్కడి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడం మంచి పరిణామం’ అని బ్లింకెన్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –