చాలా మందికి సొంతిల్లు ఒక కల. మధ్యతరగతి వారు హోమ్‌లోన్ (Home Loan) ద్వారా దాన్ని సాకారం చేసుకుంటున్నారు. ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లిస్తూ రుణం తీరుస్తున్నారు. కానీ, గృహరుణం దీర్ఘకాలంతో కూడుకొన్నది. రుణంగా ఎంత మొత్తం తీసుకున్నామో.. లోన్ తీరేనాటికి దాదాపు అంతే మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కొంత మంది వడ్డీని ఆదా చేసుకోవడం కోసం ముందస్తు చెల్లింపులు (Home Loan Prepayment) చేస్తుంటారు. అలాంటి వారు ఈ కింది విషయాలు తెలుసుకోవాలి.
గృహ రుణం (Home Loan)పై పన్ను ఆదా ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ ప్రీ పేమెంట్ చేస్తే అసలు, వడ్డీ చెల్లింపులపై లభించే పన్ను ప్రయోజనాలను కోల్పోవచ్చు. అందువల్ల ప్రీ పేమెంట్ చేసే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం మేలు.
ముందస్తు చెల్లింపుల ద్వారా ఈఎంఐ గానీ, చెల్లింపుల వ్యవధి గానీ తగ్గించుకోవచ్చు. ఒకవేళ కాలవ్యవధిని తగ్గించుకుంటే.. ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, చెల్లించాల్సిన అసలు మొత్తం తగ్గుతుంది. తద్వారా రుణం మొత్తాన్ని త్వరగా చెల్లించగలుగుతారు. ఒకవేళ ఈఎంఐ తగ్గించుకుంటే.. మీ చేతిలో ఎక్కువ మొత్తం మిగులుతుంది. కస్టమర్లు తమ అనుకూలతను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.
గృహ రుణం (Home Loan) ముందస్తు చెల్లింపులు.. రుణం తీసుకున్న కొత్తలో లాభదాయకంగా ఉంటాయి. రుణం తీసుకున్న తొలినాళ్లలో ఈఎంఐని పరిశీలిస్తే.. అసలు భాగం తక్కువగానూ, వడ్డీ భాగం ఎక్కువగానూ ఉంటుంది. రుణం తీసుకున్న కొత్తలో పాక్షిక చెల్లింపులు చేసి వడ్డీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. కానీ, చివర్లో చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా పన్ను ప్రయోజనాలు కోల్పోతారు.
గృహ రుణ (Home Loan) ముందస్తు చెల్లింపులకు ఇతర లక్ష్యాల కోసం దాచిన నిధులను ఉపయోగించడం సరికాదు. ఉదాహరణకు మీరు అత్యవసర నిధి కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టారు. రుణ భారం తగ్గించుకునే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తే, అత్యవసర పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, పదవీ విరమణ, పిల్లల చదువులు వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చేసే పెట్టుబడులను మధ్యలోనే నిలిపివేసి ఆ మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపుల కోసం ఖర్చుచేయడం కూడా మంచిది కాదు. ఇవి దీర్ఘకాలిక లక్ష్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
ముందస్తు గృహ రుణ (Home Loan) చెల్లింపులు వడ్డీని తగ్గిస్తాయి. అయితే, వడ్డీ మొత్తాన్ని తగ్గించుకునేందుకు మరో ప్రత్నామ్నాయ మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. మీ బ్యాంకు వర్తింపజేసే వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీ రేటు అందిస్తున్న మరో బ్యాంకుకు రుణ మొత్తం బదిలీ చేయడం ద్వారా వడ్డీ తగ్గించుకోవచ్చు. అయితే, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర హిడెన్ ఛార్జీల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 50 లక్షల రుణాన్ని (8.40 శాతంతో) తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇదే రుణాన్ని 8 శాతం వడ్డీ రేటుతో ఇచ్చే బ్యాంకుకు బదిలీ చేస్తే, రూ.3 లక్షల వరకు వడ్డీ ఆదా చేసుకోవచ్చు.
ఫ్లోటింగ్ రేటు ప్రాతిపదికన గృహరుణం (Home Loan) తీసుకున్న వారికి ముందుస్తు చెల్లింపులపై సాధారణంగా ఎలాంటి పెనాల్టీలూ వర్తించవు. అయితే, హిడెన్ ఛార్జీలు ఏమైనా వర్తిస్తున్నాయా తెలుసుకునేందుకు రుణ నిబంధనలు, షరతులను తెలుసుకోవడం ఉత్తమం.
ఒకవేళ మీకు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందినా లేదా ఆదాయం పెరిగినా, కొంత మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపుల (Home Loan Prepayment)కు ఉపయోగించి మిగిలిన సొమ్మును మంచి రాబడి అందించే పథకాల్లో మదుపు చేయడం కూడా మేలైన మార్గం.
హోంలోన్ ముందుగా చెల్లించాలంటే ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించాలి. ఆదాయం, ఖర్చులు, బాధ్యతలు, పెట్టుబడులు, రుణ వాయిదాలు పోను మిగులు మొత్తం కనిపిస్తేనే.. దాన్ని రుణం తీర్చేందుకు వినియోగించాలి.
👉 – Please join our whatsapp channel here –