Business

రెండు శాతం రెండు వేల నోట్లు మిస్

రెండు శాతం రెండు వేల నోట్లు మిస్

రూ.2వేల నోట్లలో 97.26 శాతం తిరిగి బేకింగ్ సిస్టమ్‌లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మే 19, 2023న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే అప్పటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లు కాగా, నవంబర్ 30, 2023 ముగింపు నాటికి రూ.9,760 కోట్లకు తగ్గింది. ఈ క్రమంలోనే మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 97.26% తిరిగి వచ్చాయని, రూ. 2,000 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి కోసం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో మొదట సెప్టెంబర్ 30, 2023 వరకు అందుబాటులో ఉంచగా.. ఆ తర్వాత దాన్ని అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించారు. మే 19నుంచి రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లోనూ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించగా.. అక్టోబర్ 9 నుంచి కౌంటర్లలో రూ. 2వేల డినామినేషన్ నోట్లను మార్చుకోవడంతో పాటు, వ్యక్తులు/సంస్థల కోసం రూ. 2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాలకు డిపాజిట్ చేయడానికి కూడా అంగీకరించనున్నట్టు ఓ ప్రకటన వెలువడింది.

అంతేకాకుండా దేశంలోని ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో.. దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి, ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయాలలో దేనికైనా ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2వేల నోట్లను పంపవచ్చని పేర్కొంది. ఆర్‌బీఐ ‘క్లీన్ నోట్ పాలసీ’ ప్రకారం రూ.2వేల డినామినేషన్ నోట్ల చెలామణిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల క్రితం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రూ. 2,000 నోట్లను చెలామణి నుండి తొలగించడం వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ చర్య బ్యాంకు డిపాజిట్లు, రుణాల చెల్లింపులను పెంచుతుందని, వినియోగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)పై మొత్తం సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z